గుట్టుగా గుట్కా..!

23 Apr, 2018 11:26 IST|Sakshi

గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జిల్లాకు గుట్కాలు చేరుతున్నాయి. అడ్డుకోవాల్సిన పోలీసు శాఖ.. ఆ వ్యాపారులు ఇచ్చిన మామూళ్ల మత్తుతో గుర్రు పెట్టి నిద్దరోతోంది. కొందరు రాజకీయ (వి)నాయకులు కూడా ఈ వ్యాపారం గుంభనంగా సాగేందుకు యథాశక్తి సహకరిస్తున్నారు... అవసరమైనప్పుడు సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ సామెత మాదిరిగా, ఈ గుట్కా పాపాన్ని అటు పోలీసు శాఖ, ఇటు రాజకీయ (వి)నాయకులు పంచుకుంటున్నారు.

ఖమ్మంక్రైం:ఉమ్మడి జిల్లాలో గుట్కా మాఫియా భారీగా విస్తరించింది. పోలీసులు దాడులు చేస్తున్నా ఈ వ్యాపారం మాత్రం నిరాటంకంగా సాగుతోంది. పోలీసులు అప్పుడప్పుడు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు. ఈ గుట్కాకు యువత బానిసగా మారుతోంది. వారి ఆరోగ్యం, భవిత దెబ్బతింటున్నాయి. ఉమ్మడి జిల్లాలో గడిచిన నాలుగు నెలల్లో 800కిì పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖ చూసీచూడనట్టుగా వదిలేసినవి ఇంకెన్నో..!

ఖమ్మంతోపాటు కొత్తగూడెం ప్రాంతంలో ఎంతో కాలంగా గుట్కా మాఫియా సాగుతోంది. వ్యాపారులు గతంలో సరుకును లారీలలో  తెచ్చేవారు. ఇప్పుడు అందరి కళ్లు గప్పి ట్రావెల్స్‌ నుంచి ఒకేసారి పది కార్లను బాడుగకు తీసుకుని కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లి అక్కడి నుంచి గుట్కా ప్యాకెట్లను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకు తీసుకొస్తున్నారు. రెండు కార్లలో ఎటువంటి గుట్కా ప్యాకెట్లను పెట్టరు. మిగతా వాటిలో  పెడతారు. అర్థరాత్రి, తెల్లవారుజామున ‘అడ్డా’లలో ఏజెంట్లకు/చిల్లర దుకాణాదారులకు చేరవేస్తున్నారు. వారు ఆటోలు, ట్రాలీలో సరుకును తీసుకెళుతున్నారు. ఇప్పుడు గుట్కా వ్యాపారం సాగిస్తున్నవారు గతంలో ఖమ్మంలో పలుమార్లు పోలీసులకు పట్టుబడిన వారే కావడం గమనార్హం. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాకు వెళ్లే ఏసీ బస్సుల్లో కూడా గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్టు తెలిసింది.

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లు ఖమ్మం, కొత్తగూడెం మీదుగా  హైదరాబాద్‌కు చేరుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి కూడా ఈ గుట్కాలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు వస్తున్నాయి. పక్కనున్న మహబూబాబాద్‌ నుంచి కొందరు ఇక్కడకు వచ్చి గుట్కా వ్యాపారులుగా అవతారమెత్తారు. లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. 

గుట్కాలను నిషేధించిన తర్వాత గుట్కా మాఫియా పెరిగింది. ప్రస్తుతం ఎక్కడో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లోని దుకాణాల్లో కూడా గుట్కాలను రహస్యంగా అమ్ముతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తున్న గుట్కా ప్యాకెట్లను వ్యాపారులు ఒకట్రెండు రూపాయలకు కొంటున్నారు. గుట్కా తినే వారి వద్దకు వచ్చేసరికి ఈ రేటు ప్యాకెట్‌ను, డిమాండునుబట్టి ఒక్కోట ?ఐదు నుంచి పది రూపాయల వరకు ఉంటోంది.  

పోలీస్‌ స్టేషన్లకు నెలనెలా మామూళ్లు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని పోలీస్‌ స్టేషన్లకు నెలవారీగా 10 నుంచి 30వేల రూపాయల వరకు మామూళ్లు ముడుతున్నట్టు తెలిసింది. ఈ గుట్కా దందా వెనుక కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని సమాచారం.

మరిన్ని వార్తలు