ఒంగోలు ఘటనపై స్పందించిన హోంమంత్రి

23 Jun, 2019 18:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఒంగోలు ఆస్పత్రిలో బాధిత బాలికను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందననారు. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఒంగోలులో మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. రేప్‌కేసు నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మహిళా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. 10రోజులు బాలికను నిర్బంధించి దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. గుంటూరులో పదో తరగతి చదువుతున్న యువతి.. ప్రియుడి కోసం ఒంగోలు వచ్చింది. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా అతను రాకపోవడంతో.. బస్టాండ్‌లోనే ఉండిపోయింది. బస్టాండ్‌లో పనిచేస్తున్న బాజి అనే దివ్యాంగుడు ఆ బాలికను గమనించి... మాయమాటలు చెప్పి.. సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మరో గదికి తరలించారు. అక్కడ నలుగురు డిప్లామా విద్యార్థులు కూడా ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 10 రోజులు నరకయాతన పడ్డ బాలిక.. శనివారం రాత్రి వారి చెర నుంచి తప్పించుకుని బస్టాండ్‌కు చేరింది. బాలికను గమనించిన అవుట్‌పోస్టు కానిస్టేబుల్‌ వివరాలు ఆరా తీశారు. జరిగిన దారుణం తెలుసుకుని ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు బాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఐదుగురినీ అరెస్ట్‌ చేశారు. డిప్లొమా విద్యార్థులు నలుగురూ మైనర్లుగా తెలుస్తోంది. మొత్తంగా గంటల వ్యవధిలోనూ పోలీసులు కేసును ఛేదించారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్పించారు.

మరిన్ని వార్తలు