పెళ్లి వేడుకలో భారీ చోరీ 

8 Jul, 2019 06:54 IST|Sakshi
రోదిస్తున్న బాధితులు మీరా, పర్విన్, ఖదిరిన్‌   

60 తులాల బంగారు ఆభరణాల అపహరణ

సాక్షి, గుంతకల్లు: పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. దాదాపు 60 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు. బాధితులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని విద్యానగర్‌లో నివాసముంటున్న ఫరూక్, ముంతాజ్‌ దంపతుల కుమారుడు అస్లాం వివాహం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో జరిగింది. శనివారం రాత్రి షుక్రానా ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము రెండు గంటల దాకా మేలుకున్నారు. వివాహానికి హాజరైన ఫరూక్‌ సమీప బంధువులైన కడపకు చెందిన మీరా, పర్వీన్, ఖదిరిన్, ఆయేషాలకు చెందిన సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు ఒకే సూట్‌కేస్‌లో ఉంచి తాళాలు వేసి పెళ్లి కొడుకు విడిది రూంలో భద్రపరిచారు.

వారంతా అక్కడే బస చేశారు. నిద్రపట్టకపోవడంతో అక్కడి నుంచి విడిది గది సమీపాన ఇన్‌స్టిట్యూట్‌ వేదికపైకి వెళ్లి నిద్రించారు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో గదిలోకి వెళ్లి చూడగా సూట్‌కేసు కనిపించలేదు. కంగారుపడిన వారు ఈ విషయాన్ని బంధువులకు చెప్పారు. సూట్‌కేస్‌ కోసం ఎంత గాలించినా జాడ దొరకలేదు. కాగా ఇన్‌స్టిట్యూట్‌ ఆవరణలో యోగా చేయడానికి వచ్చిన కొందరిని విచారణ చేయగా ఇప్పుడే ఒకతను ఆ రూంలో నుంచి సూట్‌కేసు తీసుకెళ్లడం చూశామన్నారు. బయట మరో వ్యక్తి స్కూటీలో రాగా ఇద్దరూ కలిసి వెళ్లారని చెప్పారు. మీరాకు చెందిన దాదాపు 20 తులాల బంగారు ఆభరణాలు, పర్వీన్, ఖదిరిన్‌లకు చెందిన చెరి 15 తులాలు, ఆయేషా 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.16వేల నగదు ఎత్తుకుపోయారు.

బాధితులు లబోదిబోమన్నారు. బంధువులు వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఉమామహేశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఇదిలావుండగా శాంతినగర్‌లో నబీ అనే వ్యక్తికి చెందిన టీవీఎస్‌ జస్ట్‌ రెడ్‌ కలర్‌ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. దుండగులు ఆ స్కూటర్‌ ఎత్తుకెళ్తూ ఇన్‌స్టిట్యూట్‌లో దొంగతనానికి పాల్పడ్డారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

సీసీ కెమెరాలు లేకపోవడమేమిటి? 
వివాహ కార్యక్రమాలకు భారీగా అద్దె వసూలు చేస్తున్న నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం ఏంటని సీఐ ఉమామహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తామన్నారు. పట్టణంలోని కళ్యాణ మండపాలు, ఇతర షాపింగ్‌ కాంప్లెక్స్‌ల వద్ద ఎంట్రెన్స్, అవుట్‌ గేట్‌ వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు