గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు మళ్లీ ఆదరణ 

14 Nov, 2023 07:57 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం ఎక్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు అక్టోబర్‌లో ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ కనిపించింది. ఏకంగా రూ.841 కోట్ల పెట్టుబడులను గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు సెప్టెంబర్‌ మాసంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో తాజా పెట్టుబడులు రూ.175 కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా పెరిగాయి.

ఈ ఏడాది ఆగస్ట్‌లో అత్యధికంగా రూ.1,028 కోట్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. ఇది 16 నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. జూలైలోనూ రూ.456 కోట్ల పెట్టుబడులను గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు ఏప్రిల్‌–జూన్‌ మధ్య నికరంగా రూ.298 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోయాయి. ఈ ఏడాది మార్చి నెలలో వీటి నుంచి ఇన్వెస్టర్లు రూ.1,243 కోట్లు ఉపసంహరించుకున్నారు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాల సంఖ్య (ఫోలియోలు) అక్టోబర్‌లో 27,700 పెరిగి మొత్తం 48.34 లక్షలకు చేరాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు 10 శాతం పెరిగి రూ.26,613 కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌ చివరికి వీటి విలువ రూ.23,800 కోట్లుగా ఉన్నట్టు యాంఫి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఒక గ్రాము పరిమాణంలో ట్రేడ్‌ అవుతుంటాయి. దేశీయ బంగారం ధరలనే ఇవి ప్రతిఫలిస్తుంటాయి. ‘‘ప్రస్తుతం పలు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్‌లో వడ్డీ రేట్ల పెరుగుదల కొనసాగుతుందన్న భయాలు, ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిలోనే ఉండడం, వృద్ధి రేటు తగ్గిన నేపథ్యంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు’’అని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ మెల్విన్‌ శాంటారియా తెలిపారు.    

మరిన్ని వార్తలు