భర్తకు నిద్రమాత్రలు వేసి నిద్రపోయిన తర్వాత

15 Aug, 2018 13:57 IST|Sakshi
తాళ్లూరి రాంబాబు, నాగలక్ష్మి కుటుంబం (ఫైల్‌)

భార్యను రోకలితో మోది హతమార్చిన భర్త

వివాహేతర సంబంధమే కారణమా..?

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు

పశ్చిమగోదావరి  ,ఏలూరు టౌన్‌ : ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధి, డీమార్ట్‌ సమీపంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో సోమవారం అర్ధరాత్రి రోకలి బండతో మోది చంపిన ఘటన ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఏలూరు టూ టౌన్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లూరి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రే మించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరిది లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం. వారికి నిఖిత, భవిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్‌లో, నాగలక్ష్మి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఏడాది క్రితం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టుకున్నారు.

పెద్దలు రాజీ చేయడంతో కలిసి ఉంటున్నారు. కొద్దిరోజులుగా పిల్లలను రాంబాబు తన తల్లి వద్ద ఉంచాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నాగలక్ష్మికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన రాంబాబు రోకలి బండతో తలపై మోది నాగలక్ష్మిని హతమార్చాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నాగలక్ష్మిని అక్కడే వదిలేసిన రాంబాబు ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు ఇంటి సమీపంలోకి వచ్చి పరిశీలించి వెళ్లాడు. సాయంత్ర సమయంలో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్టు చెప్పి లొంగిపోయాడు. ఎస్సై కె.రామారావు, ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వివాహేతర సంబంధమే కారణమా..?
కొంతకాలంగా భర్త రాంబాబుకు నిద్రమాత్రలు వేసి అతడు నిద్రపోయిన తర్వాత నాగలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి నిద్రమాత్రలు వేసుకున్నట్టు నటించి రాంబాబు నిద్రపో యాడు. కొద్దిసేపటికి రాంబాబు నిద్రలోనుంచి లేచిచూడగా మరో వ్యక్తితో నాగలక్ష్మి ఉండటాన్ని చూసి ఆగ్రహానికి గురయ్యాడు. ఈలోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నట్టు తెలుస్తోంది. పట్టరాని ఆవేశంతో రాంబాబు పక్కనే ఉన్న రోకలిబండతో తలపై బలంగా కొట్టటంతో నాగలక్ష్మి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. ఇంటికి తాళం వేసి రాంబాబు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూడో వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు
నాగలక్ష్మిని భర్త రాంబాబు హత్య చేశాడనే సంఘటనపై విచారణ చేపడుతున్నామని జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు తెలిపారు. ఈ హత్య ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా ?.. అసలు కారణాలు ఏమిటి అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను వెంటనే అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు