వృద్ధ గౌతమికి వరద ఉధృతి | Sakshi
Sakshi News home page

వృద్ధ గౌతమికి వరద ఉధృతి

Published Wed, Aug 15 2018 1:59 PM

Flood Water East Godavari - Sakshi

ఐ.పోలవరం (ముమ్మిడివరం): ఎగువ ప్రాంతాలలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరగడంతో ఇక్కడి అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీర ప్రాంతంలో పశుగ్రాసంతో పాటు కూరగాయల పంటలు ముంపు బారిన పడి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. లంకల్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మెరక ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మురమళ్ల రాఘవేంద్రవారధి వద్ద ఉన్న పుష్కరఘాట్‌ మెట్ల పైకి వరద నీరు చేరుకొంది. అలాగే వృద్ధ గౌతమీ గోదావరి పశువుల్లంక, ఎదుర్లంక, అన్నంపల్లి అక్విడెక్టు వద్ద వరద వలన గోదావరి ఉరకలు వేస్తోంది. మండలంలోని పశువుల్లంక, మురమళ్ల, కేశనకుర్రు, కొమరగిరి, ఎదుర్లంక, పాతయింజరం, తిళ్లకుప్ప, జి.మూలపొలం, గోగుళ్లంక, గుత్తినదీవి గ్రామాల్లోని లంక గ్రామాలు ప్రజలు, మత్స్యకారుల ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

కనకాయలంక కాజ్‌ వే పై వరద ఉధృతి
పి.గన్నవరం:  వరద ఉధృతికి పి.గన్నవరం మండలం చాకలిపాలెం నుంచి పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక గ్రామానికి కలిపే కాజ్‌ వే సోమవారం ఉదయం నీట ముగింది. దీంతో కాజ్‌ వే పై వరదనీటి ఉధృతిలోనే కనకాయలంక ప్రజలు, విద్యార్థులు ప్రమాదకర పరిస్థితిలో రాకపోకలు సాగిస్తున్నారు. మండలంలోని జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న పశ్చిమగోదావరికి చెందిన అయోధ్యలంక, పెదమల్లంక, ఆనగారిలంక, సిర్రావారిలంక తదితర గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. జి.పెదపూడి రేవు వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని పడవలపై ప్రయాణిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంక భూముల్లోని పంటలు వరద నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరంఅక్విడెక్టు వద్ద వరద నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది.

జెన్‌కో జలాశయాలకు భారీగా చేరిన వరద నీరు
మోతుగూడెం (రంపచోడవరం): లోయర్‌ సీలేరు జలాశయలు నీటి మట్టాలు క్రమంగా పెరగుతున్నాయి. పదిహేను రోజుల నుంచి ఒడిశాతో పాటు ఆంధ్రాలో భారీ వర్షాలు పడడంతో సీలేరు కాంప్లెక్స్‌కు చెందిన నాలుగు జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో జలవిద్యుత్‌ ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని స్థానిక జెన్‌కో సీఈ ఎల్‌.మోహనరావు తెలిపారు. ఈ ఏడాది కూడా నీటి కొరత లేనట్టే అన్నారు. ప్రధానంగా జోలాపుట్‌ పూర్తి నీటి మట్టం 2,750 అడుగులు కాగా ఇప్పటి వరకూ 2,734 అడుగులకు చేరింది. బలిమెల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,516 అడుగులు కాగా ప్రస్తుతం 1,459 అడుగులకు నీటిమట్టం చేరింది. గుంటవాడ జలాశయం 11,360 అడుగులు కాగా ఇప్పటికి 1,344 అడుగులుకు నీటి మట్టం చేరింది.డొంకరాయి పూర్తి స్ధాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా 1,026 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో సీలేరు కాంప్లెక్స్‌లో నాలుగు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిరాటకంగా జరుగుతుందని సీఈ తెలిపారు.

Advertisement
Advertisement