'ఆసరా' పెన్షన్‌ పథకంలో భారీ గోల్‌మాల్‌!

18 Sep, 2019 12:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చార్మినార్‌ తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా వ్యవహారం

ఎమ్మార్వో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ దుర్వినియోగం

లబ్ధిదారులకు చేరాల్సిన సొమ్ము పక్క దారి

రూ.25 లక్షల వరకు స్వాహా చేసిన ముఠా.. నలుగురి నిందితుల అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా ఆసరా పెన్షన్ల పథకంలో భారీ గోల్‌మాల్‌ జరిగింది. ఆ కార్యాలయ ఉద్యోగుల ప్రమేయంపై ఆధారాలు లభించకపోయినా వారి నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నలుగురితో కూడిన ముఠా 8 నెలల్లో 255 మంది పేర్లతో రూ.25 లక్షల వరకు స్వాహా చేసింది. దీనిపై హైదరాబాద్‌ ఆర్డీఓ డి.శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక నిందితుడు 2017లో వెలుగులోకి వచ్చిన ఇదే తరహా ఆసరా స్కామ్‌లోనూ అరెస్టు అయినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు.  

సూత్రధారి ఇమ్రాన్‌ఖాన్‌ 

ప్రతీకాత్మక చిత్రం; పోలీసుల అదుపులో నిందితులు


ఆసరా పథకం కింద పెన్షన్‌ కోరుకునే అర్హులు దరఖాస్తు, ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్వాపరాలు పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా అర్హుల దరఖాస్తును తహసీల్దార్‌ అప్రూవ్‌ చేస్తారు. ఈ తంతు ముగిసిన తర్వాత తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండే డేటా ఎంట్రీ ఉద్యోగులు దరఖాస్తుదారుడి వివరాలను తమ సంస్థాగత ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. దీనికోసం ప్రతి తహసీల్దార్‌కు ఓ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉంటాయి. ఇలా అప్‌లోడ్‌ చేసిన వివరాలు కలెక్టరేట్‌ ద్వారా ‘సెర్ఫ్‌’ కార్యాలయానికి చేరతాయి. దీంతో అక్కడి అధికారులు లబ్ధిదారుడి ఖాతాలో నెలనెలా పెన్షన్‌ జమ చేస్తుంటారు. ఈ పెన్షన్‌ను కియోస్క్‌ యంత్రంలో వేలిముద్రలు వేయడం ద్వారా లబ్ధిదారులు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం మొత్తం తెలిసిన మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ అనే వ్యక్తి ఈ స్కామ్‌కు సూత్రధారిగా మారాడు. ఆరేడేళ్లుగా బండ్లగూడ, చార్మినార్‌ తహసీల్దార్‌ కార్యాలయాల కేంద్రంగా ఇతగాడు దళారీగా పని చేస్తున్నాడు. దీంతో ఇతడికి ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. చార్మినార్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఇమ్రాన్‌ ఎమ్మార్వో వినియోగించే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సంగ్రహించాడు. వీటిని తన స్నేహితుడు, నల్లగొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహ్మద్‌ అస్లంతో పాటు సయ్యద్‌ సొహైలుద్దీన్‌లకు అందించాడు. వీరి ద్వారా ఈ రహస్య వివరాలు నగరానికి చెందిన మహ్మద్‌ మోసిన్‌కు చేరాయి. కియోస్క్‌ యంత్రాలు నిర్వహిస్తూ లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం ఇతడి వృత్తి. ఈ నలుగురూ ఇలా సంగ్రహించిన వివరాలతో ఆసరా పెన్షన్లు స్వాహా చేయడానికి దాదాపు ఎనిమిది నెలల క్రితం పథకం వేశారు.  

ఖాతా నంబర్లు మార్చి.. 
బండ్లగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన 255 మందితో కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఈ బ్యాంకు ఖాతాల నంబర్లను అప్పటికే పెన్షన్‌ పొందుతున్న ఆసరా లబ్ధిదారుల వాటికి బదులుగా రీప్లేస్‌ చేశారు. కొన్ని పేర్లను వీరే లబ్ధిదారులుగా చేర్చారు. చార్మినార్‌ ఎమ్మార్వో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెలిసి ఉండడంతో వాటి ఆధారంగా కొత్త లబ్ధిదారులు, బ్యాంకు ఖాతా నంబర్ల అప్రూవల్‌ పొందారు. అనివార్య కారణాల నేపథ్యంలో కొందరు వృద్ధులు తమ బంధువులు, సంబంధీకుల బ్యాంకు ఖాతాలను ఆసరా పెన్షన్‌ కోసం ఇస్తూ/మారుస్తూ ఉంటారు. ఆ నెపంతో వీరంతా అప్రూవల్‌ పొందారు. దీంతో అప్పటి నుంచి ఆయా లబ్ధిదారులకు చేరాల్సిన పెన్షన్‌ డబ్బు వీరి పొందుపరిచిన కొత్త ఖాతాల్లోకి వస్తోంది. ఆ డబ్బును ఖాతాదారుల సాయంతో వీళ్లు స్వాహా చేస్తున్నారు. ఇలా మొత్తం రూ.25 లక్షల వరకు ఈ గ్యాంగ్‌ కాజేసింది.  

ఇలా గుర్తింపు... 
ఇటీవల కొందరు వృద్ధులు తమకు ఆసరా పెన్షన్లు అందట్లేదని, ఆ డబ్బు తమ ఖాతాల్లో పడడం ఆగిపోయిందని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆయన స్కామ్‌ జరిగినట్లు గుర్తించారు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌ దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మదన్‌ సహకారంతో సాంకేతిక దర్యాప్తు చేసి స్కామ్‌ మూలాలు కనిపెట్టారు. దీంతో మంగళవారం అస్లంతో పాటు సొహైల్, మోసిన్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో వీరికి ఓ మహిళ సైతం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క చార్మినార్‌ ఎమ్మార్వో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ బయటకు రావడం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందా? నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అస్లం గతంలో బండ్లగూడ తహసీల్దార్‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశాడు. 2017లో మరికొందరితో ముఠా కట్టి ఆసరా పెన్షన్లనే కాజేశాడు. దాదాపు రూ.40 లక్షలు కాజేసిన ఆ స్కామ్‌లోనూ ఇతగాడు అరెస్టు అయ్యాడు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు