అప్పునకు బదులు కొడుకునెత్తుకెళ్లాడు

31 Oct, 2017 01:59 IST|Sakshi
పవన్‌(ఫైల్‌)

బోధన్‌లో వడ్డీ వ్యాపారి దారుణం 

ప్రజావాణిలో విన్నవించిన బాధితురాలు 

బోధన్‌: తీసుకున్న అప్పుకు బదులు వడ్డీ వ్యాపారి కొడుకును ఎత్తుకు పోయాడు. అప్పుతీర్చకుంటే చంపేస్తానని బెదిరించడంతో భయపడి భర్త పారిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఓ బాధితురాలు సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో తన గోడును సబ్‌ కలెక్టర్‌ వద్ద సిక్తా పట్నాయక్‌ వెళ్లబోసుకుంది. బోధన్‌లోని శర్భతీ కెనాల్‌ ప్రాంతంలో భారతి, మోతీ దంపతులకు నలుగురు పిల్లలు రవి, అంజలి, పవన్, ఓం ఉన్నారు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఊరూరా తిరుగుతూ మోతీ బట్టల వ్యాపారం చేస్తాడు.

వీరి సమీప బంధువు బోధన్‌కు చెందిన నారాయణ వద్ద వ్యాపారం కోసం ఏడాది క్రితం రూ. 70 వేలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి అప్పు చెల్లి›ంచడంలో ఆలస్యం జరిగింది. అయితే, దశల వారీగా రూ. 20 వేల వరకు చెల్లించారు. కాగా, అసలు అప్పు, వడ్డీ కలిపి రూ. 2 లక్షల వరకు అయ్యాయని.. మొత్తం అప్పు చెల్లించాలని సదరు వడ్డీవ్యాపారి ఒత్తిడి చేశాడు. వారం రోజుల క్రితం అప్పు చెల్లించి తీసుకెళ్లాలని.. వీరి కుమారుడు పవన్‌ (9)ను బలవంతంగా తీసుకెళ్లాడు.

అలాగే, అప్పు చెల్లించకుంటే చంపేస్తానని బెదిరించడంతో మోతి ఇల్లు వదిలి పారిపోయాడు. తన భర్త ఎక్కడికెళ్లిందీ.. తన కొడుకును ఏం చేశాడో తెలియదని బాధితురాలు భారతి సబ్‌ కటెక్టర్‌కు విన్నవించుకుంది. మొత్తం అప్పు చెల్లించకపోతే మిగిలిన ముగ్గురు పిల్లలను తీసుకెళ్తానని బెదిరిస్తున్నాడని బోరుమంది.  

మరిన్ని వార్తలు