3,897 కానిస్టేబుల్‌ పోస్టులు

31 Oct, 2017 01:58 IST|Sakshi

భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగులకు పోలీస్‌ శాఖ బొనాంజా అందించబోతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి 12 వేల పోస్టులకు పైగా భర్తీ చేసిన పోలీస్‌ శాఖ.. మరో 3,897 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 18 వేల పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దఫాలో 3,897 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ సోమవారం జీవో జారీ చేసింది.

కొత్త జిల్లాల నేపథ్యంలో..
నూతన జిల్లాల్లో ఏర్పడ్డ పోలీస్‌ యూనిట్లలో సివిల్, ఆర్మ్‌డ్‌ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 3,897 పోస్టుల్లో 907 సివిల్, 2,990 ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. 21 కొత్త జిల్లాలకు సంబంధించి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్మ్‌డ్‌ ఫోర్స్, కొత్తగా ఏర్పడ్డ పోలీస్‌స్టేషన్లతో సివిల్‌ పోస్టులను పోలీస్‌ శాఖ భర్తీ చేయనుంది. ఈ మేరకు కొత్తగా ఏర్పడ్డ 94 పోలీస్‌స్టేషన్లతోపాటు ఏఆర్‌ విభాగాలకు ఈ పోస్టులను కేటాయించనున్నారు. జిల్లాల వారీగా, లోకల్‌ రిజర్వేషన్, రోస్టర్‌ విధానం తదితర వ్యవహారాలను పరిశీలించిన తర్వాత పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (పీఆర్‌బీ) ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. జిల్లాల వారీగా పోస్టుల విభజన, అందుకు తగ్గట్టుగా కేటగిరీల వారీగా నోటిఫికేషన్‌ రూపొందించడం తదితర వ్యవహారాలకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

పాత జిల్లాలా? కొత్త జిల్లాలా?
ఆర్థిక శాఖ మంజూరు చేసిన కానిస్టేబుల్‌ పోస్టులు పాత జిల్లాల ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేస్తారా? లేక కొత్త జిల్లాల ప్రకారం చేస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. పాత జిల్లాల ప్రకారం భర్తీ చేస్తేనే నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేస్తే రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని, టీచర్‌ పోస్టుల వ్యవహారంలో ఇలాంటి సమస్యలు వచ్చాయని నిరుద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై పోలీస్‌ శాఖ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. మరోవైపు వయసు సడలింపు వ్యవహారంలోనూ స్పష్టత రావాల్సిఉంది. గతంలో కేటగిరీల వారీగా వయో సడలింపు ఇచ్చిన ప్రభుత్వం ఈ పోస్టుల విషయంలోనూ సడలింపు ఇవ్వాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు