Nizamabad: అభ్య‌ర్థుల‌ గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..

24 Oct, 2023 13:18 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బోధన్‌ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. 

ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్‌ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది.

మహిళా ఓటర్ల కోసం గాలం..
అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది.

ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు

నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్‌ అర్బన్‌ రూరల్‌ బోధన్‌ బాన్సువాడ
మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608
పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225
ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804


 

 

మరిన్ని వార్తలు