అమ్మను వచ్చాను. లేమ్మా..

25 Oct, 2017 07:29 IST|Sakshi
రోదిస్తున్న యమున తల్లి, (ఇన్‌సెట్‌లో) యమున

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

కన్నీటి పర్యంతమైన విద్యార్థిని తల్లి

అనంతపురం సెంట్రల్‌ :‘‘ముగ్గురు బిడ్డల్ని బాగా చదివించుకుంటిమే..ఎప్పటికైనా ఉద్యోగస్తురాలుగా చూడాలని కలలు కంటిమే.. ఇలా చూస్తాననుకోలేదు. మీ అమ్మను వచ్చాను. లేమ్మా..’’ అంటూ మార్చురీ గదిలో విగతజీవిగా పడి ఉన్న యమునపై పడి ఆమె తల్లి రాధమ్మ కన్నీటిపర్యంతమైంది. వివరాల్లోకి వెళితే..

నగరంలో శారదనగర్‌లోని శ్రీసాయి జూనియర్‌ కాలేజీలో సీఈసీ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యమున(17) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. కొత్తచెరువు మండల కేంద్రంలో నివాసముంటున్న రామాంజులు, రాధమ్మ దంపతులకు సంధ్య, సాయిలత, యమున, వంశీ సంతానం. రామాంజులు రిక్షా తొక్కుతూ, రాధమ్మ పుట్టపర్తిలో ఇళ్లలో పనిచేస్తూ పిల్లల్ని ప్రైవేటు కాలేజీల్లో చదివించుకుంటున్నారు. మూడవ కుమార్తె యమునను నగరంలో శ్రీసాయి రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో చదివిస్తున్నారు. బిడ్డల్ని ఉన్నత స్థానాల్లో చూడాలని కలలుగన్నారు. అయితే అర్ధంతరంగా మూడవ కుమార్తె యమున తనువు చాలించడంతో తట్టుకోలేకపోయారు. మార్చురీ గది దద్దరిల్లిలేలా ఆర్థనాదాలు చేశారు. ‘ఎందుకు ఇక్కడ పడుకున్నావ్‌ తల్లీ..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.  

పొంతనలేని యాజమాన్యం మాటలు:  విద్యార్థి మృతిపై యాజమాన్యం చేసిన ప్రకటనలు ఒకదానికొకటి పొంతనలేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. రెండు నెలల క్రితం ఆగస్టు 8న రాసిన ఓ లేఖను బయట పెట్టారు. ‘‘అమ్మా నాన్నా.. ప్రతి రోజూ నేను ఏడుస్తున్నాను. ఏడ్చి ఏడ్చి తలనొప్పి వస్తోంది. అందర్నీ నేను ఇబ్బంది పెడుతున్నా. సారీ అమ్మా.. సారీ నాన్న..’’ అంటూ రాసిన ఓ లేఖ దొరికింది. అయితే రెండు నెలల క్రితమే సూసైడ్‌ నోట్‌ రాసుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు తోటి విద్యార్థులు హ్యాండ్‌ రైటింగ్‌ యమునది కాదని తేల్చారు. అలాగే క్లాసులకు సక్రమంగా వెళ్లడం లేదని వార్డెన్‌ ఉదయాన్నే ఆఫీసురూంలో మందలించాడన్నారు. దీంతో రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసే సరికి ఉరివేసుకుందని చెప్పారు.  విద్యార్థిని తల్లిదండ్రులు కూడా మా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, యాజమాన్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని బోరున విలపించారు. ఘటనపై వన్‌టౌన్‌ సీఐ సాయిప్రసాద్‌ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా : ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం వేధించడం వల్ల విద్యార్థి యమున ఆత్మహత్య చేసుకుందని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నేతలు బండిపరుశురాం, నరేంద్రరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు జాన్సన్‌బాబు తదితరులు ఆరోపించారు. శ్రీసాయి కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సదరు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు