ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

22 May, 2018 08:53 IST|Sakshi

సాక్షి, పంజాగుట్ట : ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మనోహర్‌ రెడ్డి, చంద్రకళ దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఖైరతాబాద్‌ రాజ్‌నగర్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు అభిషేక్‌ రెడ్డి (16) ఇంటర్‌ పూర్తి చేసి సీపీటీ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం తండ్రితో పాటు బయటికి వెళ్లివచ్చిన అతను ఆకలిగా లేదని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. సోమవారం ఉదయం అతని తండ్రి మనోహర్‌ రెడ్డి కుమారుడిని నిద్ర లేపేందుకు ప్రయత్నించగా తలుపులు తీయలేదు.

దీంతో తలుపు సందులోనుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో అతను పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అభిషేక్‌ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘అందులో అమ్మ, నాన్నా మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మను ఎంత ప్రేమించానో ఆ అమ్మాయినీ అంతే ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఆ పిల్లను వదిలేస్తానంటే నెయిల్‌ పాలీష్‌ తాగి చనిపోతాను అంటుంది. నేను ఎంతో స్ట్రగల్‌ అవుతున్నాను. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. నాకు ఈ లైఫ్‌ వద్దు. నావల్ల ఎవ్వరూ బాధపడవద్దు, నా సెర్మనీకి అందరూ రావాలి’ అని రాసి ఉంది. 

మరిన్ని వార్తలు