క్వెట్టాలో కరెన్సీ ప్రెస్‌!

5 Feb, 2020 08:38 IST|Sakshi

నకిలీ నోట్ల ముద్రణకు ఏర్పాటు చేసిన ఐఎస్‌ఐ

భారీ స్థాయిలో ఇండియన్‌ ఫేక్‌ కరెన్సీ ప్రింటింగ్‌

సౌత్‌ ఇండియాలో సర్క్యులేషన్‌కు బబ్లూ కీలకం

11 నెలలు గాలించి పట్టుకున్న సిటీ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడానికి పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అక్కడి బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ఓ పవర్‌ ప్రెస్‌ ఏర్పాటు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రింట్‌ అవుతున్న నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉంటున్నాయి. బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌లోకి వస్తున్న ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో చలామణి చేయించడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమీన్‌ ఉల్‌ రెహ్మాన్‌ అలియాస్‌ బబ్లూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ఇతడి అనుచరుడిని పట్టుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాదాపు 11 నెలల గాలించి ఈ కీలక నిందితుడిని పట్టుకోగలిగారు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని, 2013 నుంచి రిజిస్టర్‌ అవుతున్న ఈ కేసుల్లో బబ్లూ వాంటెడ్‌గా ఉన్నాడని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. 

రూట్‌ మార్చి..
క్వెట్టాలో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్‌ఐ ప్రత్యేక పార్శిల్స్‌ ద్వారా వివిధ మార్గాల్లో భారత్‌కు పంపిస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్‌ నుంచి విమానాల ద్వారా దుబాయ్‌/సౌదీ అరేబియాలను తరలించేవారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జల మార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకులు ఇలా అనేక పేర్లతో ఈ కన్‌సైన్‌మెంట్స్‌ వచ్చేవి. గడిచిన కొన్నేళ్లుగా ఈ మార్గంలో తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్‌ఐ తన రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చలామణి చేయిస్తోంది.

వివిధ దశల్లో ఏజెంట్లు..
నకిలీ కరెన్సీ డంప్‌ చేసి చలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్‌ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఏళ్లుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్‌ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్‌ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లా మాల్దాకు చెందిన బబ్లూ ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక మంది ఏజెంట్లకు సరఫరా చేస్తుంటాడు.

ఇలా వెలుగులోకి..
చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్‌ గౌస్‌ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్‌ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేక మంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతగాడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చెలామణి చేస్తున్నాడు. ఇతగాడికి 2013లో మాల్దా జిల్లాలో కృష్ణాపూర్‌ ప్రాంతానికి చెందిన బబ్లూతో పరిచయం ఏర్పడింది. అతడికి రూ.40 వేల నుంచి రూ.50 వేల చొప్పున అసలు కరెన్సీ చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చలామణి చేసేశాడు. బబ్లూ గౌస్‌తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నాడు. ఈ కరెన్సీని నగరంలో సర్క్యులేట్‌ చేస్తున్న గౌస్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 11 నెలల క్రితం పట్టుకున్నారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే బబ్లూ పేరు వెలుగులోకి వచ్చింది. మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన అతడి కోసం అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థకియుద్దీన్, వి.నరేందర్‌లతో కూడిన బృందం మాల్దా వెళ్లి ఇతడి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు పట్టుకుని నగరానికి తీసుకువచ్చింది. తదుపరి చర్యల నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించింది. ఇతడి అరెస్టుకు సంబంధించి ఇతర జిల్లాలు, రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. 

మరిన్ని వార్తలు