హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

22 Jul, 2019 02:18 IST|Sakshi

మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన రయీసుద్దీన్‌ 

పర్భనీ మాడ్యూల్‌లో అత్యంత కీలక ఉగ్రవాది 

పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చేతిరాత నమూనా

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) అధికారులు అక్కడి పర్భనీలో అరెస్టు చేసిన ఐసిస్‌ మాడ్యూల్‌కు చెందిన కొన్ని నమూనాలు హైదరాబాద్‌కు రానున్నాయి. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నమూనాలను ఇప్పటికే పుణేలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి పంపిన ఎన్‌ఐఏ రిపోర్టులు సైతం తీసుకుంది. అయితే, హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌లోనూ వీటిని పరీక్ష చేయించి రిపోర్టులు తీసుకోవాలని న్యాయస్థానం గత వారం ఆదేశించింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన ఐసిస్‌ మాడ్యూల్‌ను మహారాష్ట్ర ఏటీఎస్‌ అధికారులు 2016లో అరెస్టు చేశారు. అప్పట్లో పట్టుబడిన నసీర్‌ బిన్‌ యాఫై చావుస్, షాహిద్‌ ఖాన్, ఇక్బాల్‌ అహ్మద్‌ కబీర్‌ అహ్మద్, రయీసుద్దీన్‌ సిద్ధిఖీలకు విదేశంలో ఉన్న ఐసిస్‌ హ్యాండ్లర్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఏటీఎస్‌ ఆరోపించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రయీసుద్దీన్‌కు కింది కోర్టు బెయిల్‌ తిరస్కరించడంతో అతడి తరఫు లాయర్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తన వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ తరఫు లాయర్‌ ఆ మాడ్యూల్‌లో రయీస్‌ కీలకంగా వ్యవహరించారని వాదించారు. 

ఖలీఫాకు బద్ధులమై...  
మాడ్యూల్‌కు ‘అమీర్‌’గా (చీఫ్‌) నసీర్‌ వ్యవహరించినప్పటికీ తామంతా ‘ఐసిస్‌’అధినేత అబు బకర్‌ అల్‌ బగ్దాదీకి (ఖలీఫా) బద్ధులమై ఉంటామని, కాలిఫట్‌గా పిలిచే సైన్యంగా మారుతామని అందరితో ప్రమాణం చేయించింది మాత్రం రయీస్‌ అని స్పష్టం చేశారు. అరెస్టు సందర్భంలో రయీస్‌ సహా ఇతరుల నుంచి సేకరించిన బయాహ్‌ పత్రాల్లో ఉన్న చేతి రాతతో పోల్చడానికి గతంలోనే న్యాయస్థానం నుంచి అనుమతి పొంది రయీస్‌ చేతిరాతలు తీసుకున్నామని వివరించారు.

ఈ నమూనాలను పరీక్షించిన పుణే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సైతం రయీస్‌ రాసినవే అని తేల్చినట్లు కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం నుంచి అనుమతి పొంది రయీస్‌ చేతిరాతలు తీసుకున్నామని అక్కడా పరీక్షలు పూర్తయిన తర్వాత నివేదిక సంగ్రహించి దాంతో పాటు పుణే ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇచ్చిందీ తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో బయాహ్‌ పత్రాలతో పాటు రయీస్‌ చేతిరాతల్ని హైదరాబాద్‌ పంపడానికి ఎన్‌ఐఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఉన్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక కీలక, ప్రతిష్టాత్మక, హై ప్రొఫైల్‌ కేసుల్లో తమ నివేదికలు అందించింది. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు ఈ తరహా ఆదేశాలు ఇచ్చి ఉండచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు