రవాణా కమిషనర్‌ కార్యాలయంలో దాడులు

12 Feb, 2020 04:06 IST|Sakshi

అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

రూ.36 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్‌

ఏసీబీకి పట్టుబడటం ఇది రెండోసారి

సాక్షి, హైదరాబాద్‌: స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కొలువుదీరి ఉండే రవాణా కమిషనర్‌ కార్యాలయంలోనే లంచావతారం పడగవిప్పింది. కొత్త వాహనాల్లో మార్పుచేర్పులు, అక్షర దోషాలను సవరించడం వంటి విధులు నిర్వహించే పరిపాలనాధికారి జె.నరేందర్‌ మంగళవారం రూ.36 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా అవినీ తికి పాల్పడుతూ నరేందర్‌ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్‌ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

సంగారెడ్డికి చెందిన సీహెచ్‌ సందీప్‌ ట్రేలర్‌ అండ్‌ ట్యాంకర్‌గా వాహనాన్ని మార్పు చేసుకోవడం కోసం రవాణాశాఖ నుంచి ప్రొసీడింగ్స్‌ను పొందేందుకు గత నెల 13న అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి నరేందర్‌ను సంప్రదించాడు. సదరు అనుమతుల కోసం రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నరేందర్‌ డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.30 వేలు తీసుకొని ప్రొసీడింగ్స్‌ ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో సందీప్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు రూ.36 వేల నగదును నరేందర్‌కు అందజేశాడు. అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు నరేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2016 జనవరి 4న ఒక కేసులో రూ.8,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్‌ తిరిగి మరోసారి పట్టుబడటం గమనార్హం. అతన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. 
రవాణా శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచాలు డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌–1064కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రవాణా కమిషనర్‌ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ దాడులతో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దళారులను కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు