నకిలీ డాక్టర్లకు సంకెళ్లు

16 Feb, 2018 13:02 IST|Sakshi

కల్లూరు/ఎమ్మిగనూరు రూరల్‌ :  కర్నూలులోని సుఖీభవ ఆస్పత్రి, ఎమ్మిగనూరులోని శ్రీనరహరి క్లినిక్‌కు చెందిన నకిలీ డాక్టర్లను కటకటాల వెనక్కి పంపారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం ఈ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి..నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసిన విషయం విదితమే. కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్స్‌లో ఉన్న సుఖీభవ ఆస్పత్రి ఎండీ నాగప్రకాష్‌ (ఎండీ), ఇందులో పనిచేసే యునాని డాక్టర్‌ రేష్మాబేగం అర్హతలు లేనప్పటికీ అల్లోపతి వైద్యం చేస్తుండడంతో విజిలెన్స్‌ సీఐలు శ్రీనివాసరెడ్డి, జీవన్‌కుమార్‌ బుధవారం అర్ధరాత్రే వారిని అదుపులోకి తీసుకుని.. నాల్గవ పట్టణ పోలీసులకు అప్పగించారు.

నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామయ్య నాయుడు తెలిపారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపరిచామన్నారు. అలాగే ఎమ్మిగనూరులో శ్రీ నరహరి క్లినిక్‌ నిర్వహిస్తూ విజిలెన్స్‌కు దొరికిపోయిన నకిలీ డాక్టర్‌ నరహరిరెడ్డి, అతని కుమారుడు శ్రీనివాసరెడ్డిలను గురువారం పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై చీటింగ్‌తో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్‌కు పంపుతూ మెజిస్ట్రేట్‌ వాసుదేవ్‌ ఆదేశాలిచ్చారన్నారు. 

మరిన్ని వార్తలు