-

45 చలానాలు.. 50 వేల జరిమానా

19 Aug, 2018 13:08 IST|Sakshi

జనసేన నాయకుడి రికార్డు

సాక్షి, హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘనల్లో ఓ జనసేన నాయకుడు రికార్డు సృష్టించాడు. ఏకంగా 45 చలానాలకు రూ.50 వేల జరిమానాను చెల్లించాడు. ఈ సంఘటన నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ ఎస్సై కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఓవర్‌స్పీడ్‌తో పోలీసులను హడలెత్తించడంతో అతనిపై ట్రాఫిక్‌ పోలీసులు 45 చలానాలు నమోదు చేశారు. వీటి మొత్తం జరిమానా రూ.54,773.83గా నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి  చెందిన బాలాజీ జనసేన పార్టీ నాయకుడు. ఏడాదిన్నర కాలంగా ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని ఉపయోగిస్తున్నాడు.

అతివేగంతో వెళుతూ ఇతర వాహనాలను హడలెత్తించాడు. దీంతో చాలాసార్లు ట్రాఫిక్‌ పోలీసులు ఈ వాహనంపై ఓవర్‌స్పీడ్‌ కేసులు నమోదు చేశారు. అంతే కాదు. నో పార్కింగ్, సిగ్నల్స్‌ను జంపింగ్‌ వంటి కేసులు కూడా నమోదయ్యాయి. వ్యక్తిగత పనులపై నగరానికి వచ్చిన బాలాజీ తన వాహనాన్ని శనివారం హిమాయత్‌నగర్‌ వీధినెంబర్‌ 6లో పార్క్‌ చేశాడు. అదే సమయంలో నారాయణగూడ ట్రాఫిక్‌ ఎస్సై కృష్ణంరాజు నో పార్కింగ్‌లో పార్కుచేసి ఉన్న బాలాజీ వాహనం జరిమానాల పాత చిట్టాను పరిశీలించడంతో భారీ మొత్తంలో అతను జరిమానా చెల్లించాల్సి ఉన్న విషయం బయటపడింది. వాహనాన్ని సీజ్‌చేసి చార్జ్‌షీట్‌ వేస్తామని ట్రాఫిక్‌ ఎస్సై హెచ్చరించడంతో బాలాజీ అప్పటికప్పుడు జరిమానా మొత్తాన్ని డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించాడు. ట్రాఫిక్‌ చలానాల విషయంలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించడం ఒక రికార్డుగా చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు