లష్కరే కమాండర్‌ నవీద్‌ జఠ్‌ హతం

29 Nov, 2018 03:50 IST|Sakshi
ఉగ్రకాల్పుల్లో రక్తమోడుతున్న తోటి జవానును తరలిస్తున్న సైనికులు. ఉగ్రవాది నవీద్‌ (ఫైల్‌)

పాత్రికేయుడు బుఖారీ హత్యకేసులో మోస్ట్‌ వాంటెడ్‌

ఫిబ్రవరిలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న ఉగ్రవాది

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో భద్రతా సిబ్బంది, పౌరులపై పలు అమానుష దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా కమాండర్‌ నవీద్‌ జఠ్‌ (22) హతమయ్యాడు. కశ్మీరీ సీనియర్‌ పాత్రికేయుడు షుజాత్‌ బుఖారీ హత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు. కశ్మీర్‌ బుద్గాం జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జఠ్‌తో పాటు అతని సహచరుడుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. గతంలో జఠ్‌ ఆరు సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అతడు పోలీసు కస్టడీ నుంచే నాటకీయ పరిణామాల నడుమ పారిపోవడం సంచలనం సృష్టించింది. జఠ్‌ పాకిస్తానీయుడని, విధానపర లాంఛనాల ప్రకారం అతని మృతదేహాన్ని పాకిస్తాన్‌కు అప్పగిస్తామని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ చెప్పారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిందిలా..
మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో బుద్గాంలోని కుత్పోరా చాతర్‌ గామ్‌ అనే ప్రాంతంలో బుధవారం వేకువ జామునే భద్రతా సిబ్బంది తనిఖీల్ని ముమ్మరం చేశారు. జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ బృందం, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. సూర్యోదయం అయ్యాక ఇద్దరు మిలిటెం ట్లను భద్రతా సిబ్బంది అంతమొందించారు. మృతుల్లో ఒకరిని నిషేధిత ఎల్‌ఈటీ కమాండర్‌ నవీద్‌ జఠ్‌గా గుర్తించారు.

కసబ్‌కు సహాధ్యాయి..
పాక్‌లోని ముల్తాన్‌లో జన్మించిన నవీద్‌ జఠ్‌.. 26/11 ముంబై దాడిలో సజీవంగా చిక్కిన అజ్మల్‌ కసబ్‌కు మదరసాలో సహాధ్యాయి. వీరిద్దరు అక్కడే ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు. సముద్ర మార్గంలో వినియోగించే దిక్సూచి కంపాస్, జీపీఎస్, వైర్‌లెస్‌ సెట్లు, స్కైప్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన మొబైల్‌ ఫోన్లను ఆపరేట్‌ చేయడంలో జఠ్‌ నైపుణ్యం సంపాదించాడు. 2012, అక్టోబర్‌లో జఠ్‌ తన సహచరులతో కలసి కశ్మీర్‌ లోయలోకి చొరబడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. లోయలో ఎన్నో ఉగ్రదాడులు, బ్యాంకు దొంగతనాల్లో అతని పాత్ర ఉందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు