హాజీపూర్‌ సర్పంచ్‌ కిడ్నాప్‌కు యత్నం

13 Jan, 2020 11:47 IST|Sakshi
సర్పంచ్‌ శ్రీనివాస్‌

టీ కొట్టులో ఉండగా జీపులో ఎక్కించుకొని వెళ్లిన నిందితులు

భయాందోళనతో కేకలు పెట్టిన శ్రీనివాస్‌

పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు  

లక్ష్మీనారాయణపూర్‌ వద్ద కిడ్నాపర్ల వాహనం పట్టివేత   

అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితుల దురాఘతం

యాలాల: మండల పరిధిలోని హాజీపూర్‌ సర్పంచ్‌ ఒంగోనిబాయి శ్రీనివాస్‌ను నలుగురు వ్యక్తులు అపహరించే యత్నం చేశారు. భయాందోళనకు గురైన ఆయన కేకలు వేయడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. ఆర్థిక వ్యవహారం నేపథ్యంలో ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. హాజీపూర్‌ సర్పంచ్‌ శ్రీనివాస్‌ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన తుప్పుడు సంతోష్‌ వద్ద గతేడాది రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రూ.1.50 లక్షలు తిరిగి ఇవ్వగా మిగతా డబ్బుల కోసం శ్రీనివాస్‌ను సంతోష్‌ వేధించసాగాడు.

ఈక్రమంలో ఆదివారం సాయంత్రం మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న టీకొట్టులో ఉన్న సర్పంచ్‌ శ్రీనివాస్‌ను తుప్పుడు సంతోష్‌తో పాటు సాయిలు, శ్రీనివాస్, సునీల్‌ కలిసి క్రూజర్‌ (కేఏ 32 ఎం 7563) వాహనంలో వచ్చి బలవంతంగా ఆయనను అందులోకి ఎక్కించుకొని లక్ష్మీనారాయణపూర్‌ వైపు వెళ్లిపోయారు. ఈ హఠాత్మరిణామంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్‌ తనను రక్షించాలని కేకలు వేశాడు. దీంతో టీకొట్టు యజమాని రాజు వెంటనే యాలాల పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చాడు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఆదేశాలతో బ్లూకోల్ట్‌ సిబ్బంది క్రూజర్‌ వాహనాన్ని వెంబడించారు. లక్ష్మీనారాయణపూర్‌ వద్ద ఉన్న గనుల శాఖ చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. లక్ష్మీనారాయణపూర్‌ వద్దకు క్రూజర్‌ రాగానే అడ్డుకొని వాహనంలోని వారందరిని పోలీసులకు అప్పగించారు. అనంతరం రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి యాలాల ఠాణాలో జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే తుప్పుడు సంతోష్‌ ఈ చర్యకు దిగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో మండలంలో కలకలం రేపింది.

మరిన్ని వార్తలు