కోపార్డి గ్యాంగ్‌రేప్‌ కేసులో సంచలన తీర్పు

18 Nov, 2017 14:29 IST|Sakshi

పుణే : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కోపార్డి గ్యాంగ్‌ రేప్‌ కేసులో అహ్మద్‌నగర్‌ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులను దోషులుగా ఖరారు చేసింది. వీరికి శిక్షలను నవంబర్ 22న ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. 

నిందితులు ముగ్గురు జితేంద్ర షిండే, సంతోష్‌ జి.భవల్‌, నితిన్‌ జి.భాయ్‌లుమేలు బాలికపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని న్యాయమూర్తి సువర్ణ కోవలె పేర్కొన్నారు . కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు.. వారు నేరానికి పాల్పడినట్లు నిరూపించాయని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

కేసు పూర్వపరాలు... 

2016, జూలై 13న అహ్మద్‌నగర్‌ జిల్లా కోపార్డి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక దారుణంగా హత్యాచారానికి గురైంది. తన తాత ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమెను ఎత్తుకెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. బాధితురాలు మరాఠ తెగకి చెందిన యువతి కావటం..  నిందితులు దళితులు కావటంతో ఇరువర్గాల పరస్పర ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడుకిపోయింది. అదే సమయంలో నాసిక్‌లోని కొన్ని ప్రాంతాల్లో దళితులపై దాడులు కూడా జరగటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 

పరిస్థితి చేజారిపోతుందని భావించిన ప్రభుత్వం, సమన్వయం పాటించాలంటూ ఇరువర్గాలను శాంతింపజేసి.. ఉజ్జల్‌ నికమ్‌ను స్పెషల్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించి కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. సుమారు 6 నెలలపాటు దర్యాప్తు చేపట్టిన ప్రాసిక్యూషన్‌ దర్యాప్తు ఆధారంగా మొత్తం 350 పేజీల ఛార్జ్‌షీట్‌తోపాటు 24 ఆధారాలను కోర్టుకు సమర్పించారు. 

అయితే ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేకపోవటంతో ప్రాసిక్యూషన్‌ సమర్పించిన ఆధారాలనే పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఫోరెన్సిక్‌ నివేదిక ప్రకారం(బాధితురాలి రక్తపు మరకలు.. నిందితుల దుస్తులపై ఉన్న మరకలతో సరిపోలటంతో) వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించినట్లు నికమ్‌ వెల్లడించారు. 

బాలిక తల్లి స్పందన...

కాగా, కోర్టు తీర్పు పట్ల బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు, పోరాటంలో పాలుపంచుకున్న మరాఠా ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దోషులకు మరణశిక్ష విధించాలని ఈ సందర్భంగా ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు