అవలంగిలో వ్యక్తి దారుణ హత్య

3 Oct, 2019 08:05 IST|Sakshi
కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న జమ్మయ్య మృతదేహం,మృతుడు జమ్మయ్య (ఫైల్‌)

కాళ్లు, చేతులు నైలాన్‌ తాడుతో  కట్టేసి వైనం

ఆపై చెరువులో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు

సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) :ప్రశాంతతకు మారుపేరైన పాలకొండ మండలం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్నపాటి నేరాలు తప్పితే హత్యోదంతాలు అంతగా లేని ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి చెరువులో పడేశారు. అవలంగి గ్రామ సమీపాన నాయుడు చెరువులో తేలిన మృతదేహం గ్రామానికి చెందిన కురమాన జమ్మయ్య(58)గా బుధవారం ఉదయం స్థాని కులు గుర్తించారు. ఏడాది క్రితమే మృతుడు కుమారుడు ఆదినారాయణ (30) అనుమానా స్పదంగా మృతి చెందగా, తాజాగా తండ్రి హత్యతో సర్వత్రా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తొలుత ఎవరో బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి ఉంటారని స్థానికులు భావించారు. వీరి నుంచి సమాచారం అందుకు న్న ఎస్సై ఎస్‌ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కాళ్లు, చేతులు నైలాన్‌ తాడుతో కట్టేసి, శరీరంపై కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. 

హత్యగా కేసు నమోదు...
అత్యంత పాశవికంగా జమ్మయ్య హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లను రప్పించారు. పోలీసులు తీసుకువచ్చిన కుక్కలు చెరువు సమీపంలో ఓ మదుము వరకు, సమీపంలో మరో గిరిజన గ్రామమైన బర్న రహదారికి పరుగులు తీసి ఆగిపోయాయి. అలాగే క్లూస్‌ టీమ్‌ మృతదేహంపై వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ పీఆర్‌ఆర్‌ ప్రసాద్, సీఐ ఎస్‌ ఆదాం చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


.ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు