తెలుగుగంగ కాలువపై వ్యక్తి దారుణ హత్య

9 Feb, 2018 06:30 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ అక్కేశ్వరరావు

వేట కత్తులతో అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగులు   

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిల్లకూరు: వేట కత్తులతో ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన మండలంలోని కడివేడు రెవెన్యూ పరిధి అటవీ ప్రాంతంలో ఉన్న తెలుగుగంగ ఐదో బ్రాంచ్‌ కాలువపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గూడూరు రూరల్‌ సీఐ అక్కేశ్వరరావు కథనం మేరకు.. ఓజిలి మండలం భువనగిరిపాళెంకు చెందిన మల్లి శ్రీనివాసరావు అలియాస్‌ సన్యాసి (42) కొంతకాలంగా కోట మండలం విద్యానగర్‌ ప్రాంతంలోని ఎన్టీఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను ఓజిలి మండలం రాజుపాళెం గ్రామంలోని జాతీయ రహదారిపై పంక్చర్‌ షాపు నిర్వహిస్తున్నాడు.

రోజూలానే మోటారుబైక్‌పై విద్యానగర్‌ నుంచి రాజుపాళెంకు దగ్గరగా ఉంటుందని సమీపంలోని తెలుగుగుంగ కాలువపై నుంచి వెళుతున్నాడు. అటవీ ప్రాంతంలో నిర్మాణుష్యంగా ఉన్న ప్రాంతంలో నుంచి అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వేట కత్తులతో శరీరంపై ఎక్కడపడితే అక్కడ నరికి వేయడంతో శ్రీనివాసరావు రక్తపు మడుగులో కొట్టుకుని మృతిచెందాడు. అటుగా వెళుతున్న ఓ యువకుడు రక్తపుమడుగులో వ్యక్తి ఉన్నాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం వివరాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట చిల్లకూరు, గూడూరు రూరల్‌ ఎస్సైలు కె.శ్రీనివాసరావు, బాబీ, సిబ్బంది ఉన్నారు. 

కాపు కాసి..  
శ్రీనివాసరావు రోజూ ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి తెలుగు గంగకాలువ వద్దకు ఎంత సమయానికి వస్తాడు? తదితర విషయాలను దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎవరూ లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని మద్యం తెచ్చుకుని సేవించి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో నాలుగు డిస్పోసబుల్‌ గ్లాసులు ఉండటంతో నలుగురు వ్యక్తులు హత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

ఏం కారణం?  
శ్రీనివాసరావు భువనగిరిపాళెంలో నివాసం ఉన్న సమయంలో తన మొదటి భార్యను హతమార్చి అక్కడి నుంచి నివాసాన్ని విద్యానగర్‌ ప్రాంతా నికి మార్చి ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల భూ వివాదం నేపథ్యంలో తన వదిన చెవి నరికివేసినట్లు ఓజిలి పోలీసు స్టేషన్‌లో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు ఈ రెండింటిలో ఏదైనా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు