కీచకుడిని ఉరితీయాలి

7 Mar, 2020 09:04 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కిరణ్‌కుమార్‌

సాక్షి, గోపాల్‌పేట/వనపర్తి: అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన కీచకుడిని వెంటనే ఉరితీయాలని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, నాయకులు, ప్రజలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని ఏదుట్లలో అమాయక పిల్లలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ప్రైవేటు టీచర్‌ శరత్‌ను ఉరితీయాలని విద్యార్ధి సంఘాలు, కుల సంఘాలు, నాయకులు పాఠశాలల విద్యార్థులు ధర్నాకు దిగారు. అతడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏదుట్ల గ్రామ బస్టాండు ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఘటన జరిగి 24 గంటలు గడిచిన కూడా జిల్లా స్థాయి అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. మండల స్థాయి పోలీసులతో కాకుండా జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మహేష్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆది, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు భగత్, బీసీ సంఘం రాష్ట్రకార్యదర్శి అరవింద్‌ స్వామి పాల్గొన్నారు.  

కోరిక తీర్చలేదని వివాహితకు నిప్పు..


             ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడుతున్న డీఎస్పీ తదితరులు

నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం: డీఎస్పీ  
ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ సూర్యనాయక్‌ ఏదుట్లకు చేరుకున్నారు. విద్యార్థి, కుల సంఘాలు, గ్రామస్తులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మర్రికుంట డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. గురుకుల కోచింగ్‌ ఇస్తానంటూ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు శరత్‌ని ఇరువురు బాధితుల ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. విచారణలో నిందితుడు తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడని వెల్లడించారు. ఈమేరకు ఫోక్సో కింద రెండు కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించి వివరాలు అందించాలని, దీంతో కేసుకు మరింత బలం చేకూర్చే వీలుంటుందన్నారు. బాధితుల తల్లిదండ్రుల వివరాలు ఎవరికీ చెప్పమని హామీ ఇచ్చారు. ప్రజలు సహకరిస్తే 90 రోజుల్లో చార్జిషీట్‌ వేసి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ సూర్యనాయక్, గోపాల్‌పేట ఎస్‌ఐ రామన్‌గౌడ్, వనపర్తి రూరల్‌ ఎస్‌ఐ షేక్‌షఫి ఉన్నారు. 

మరిన్ని వార్తలు