మృత్యుంజయుడు

28 Jun, 2018 14:22 IST|Sakshi
వెంకన్నను భుజంపై తీసుకుని వెళ్తున్న సీఐ వేణు చందర్

వర్ధన్నపేట: లారీ, బైక్‌ ఢీ కొన్న సంఘటనలో బైక్‌ నడుపుతున్న యువకుడు లారీ కింద ఇరుక్కుని నరకయాతన అనుభవించి ఎట్టకేలకు పోలీసుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి బయట పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

భారీ యంత్రాల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న లారీ డీసీతండాకు చెందిన ఆంగోతు వెంకన్న, ఆంగోతు సంతోష్‌లు తమ బైక్‌పై వరంగల్‌ వైపు వస్తున్న క్రమంలో అదుపు తప్పి ఢీ కొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న అంగోతు వెంకన్న తన బైక్‌తో పాటు లారీకిందకు దూసుకుపోయి ఇరుక్కున్నాడు. సంతోష్‌ పక్కన పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంకన్నను కాపాడడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తున్న తరుణంలో రోడ్డు కిందకు వెళ్లింది. దీంతో అందులో ఇరుక్కుపోయి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అక్కడికి చేరుకున్న గిరిజనులు కూడా ప్రయత్నించినా బయటకు రావడం సాధ్యం కాలేదు.

దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. వర్ధన్నపేట సీఐ వేణుచందర్, ఎస్సైలు ఉపేందర్‌రావు, శ్రీధర్‌తో పాటు సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగ్రాతుడిని బయటకు తీసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది.

వెంకన్న పరిస్థితిని చూసి పోలీసులు ముందస్తుగా స్థానిక వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు  ఘటన స్థలానికి చేరుకుని చికిత్సకు కావాల్సిన ఆక్సిజన్, ప్రథమ చికిత్స పరికరాలు, 108 వాహనం సిద్ధంగా ఉంచారు.

లారీ కింద ఇరుక్కుపోయిన వెంకన్నను తీయడానికి రెండు జేసీబీలు, ఒక క్రైన్‌ను తీసుకువచ్చి వాటి సహా యంతో బయటకు తీశారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి వెంకన్నను ప్రాణాలతో బయటకు తీశారు. క్షతగాత్రుడిని సీఐ వేణుచందర్‌ తన భుజాలపై ఎత్తుకుని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లి పడుకోబెట్టగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

అనంతరం ఎంజీఎంకు తరలించారు. కాలుకు రెండు చోట్ల, చేయికి తీవ్ర గా యాలు కావడంతో పాటు కడుపులో సైతం ఇబ్బందులు ఏర్పడటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరో వ్యక్తి సంతోష్‌ వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


 

మరిన్ని వార్తలు