వివాహిత ఆత్మహత్య

10 May, 2019 10:41 IST|Sakshi
రోడ్డుపై ధర్నా చేస్తున్న బాధితురాలి బంధువులు (ఇన్‌సెట్‌లో) మృతి చెందిన అంజలి (ఫైల్‌)

అత్తింటివారి పనే అంటున్న మృతురాలి బంధువులు

అనంతపురం ,రాయదుర్గం రూరల్‌: మండలంలోని రేకులకుంట గ్రామానికి చెందిన గాజుల అంజలీ (21) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. బాధితురాలి తండ్రి చంద్ర, తరుపు బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ... రేకులకుంటకు చెందిన అంగడి గోవిందప్ప రెండో కుమారుడు సోమనాథ్‌కు కంబదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామానికి చెందిన చంద్ర కుమార్తె అంజలితో మూడేళ్ల క్రితం వివామైంది.  భార్యను పోషించలేని సోమనాథ్‌ తరచూ అంజలీని అనుమానం పడుతు వరకట్నం తీసుకురావాలని చిత్రహింసలు పెట్టి వేధించేవాడు. విషయాన్ని అంజలీ గతంలో తండ్రికి చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. బుధవారం కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన అంజలీతో అత్త లక్ష్మీదేవి, మామ గోవిందప్ప, మరిది సతీష్, బావ నారాయణస్వామిలు ఒత్తిడి చేసి ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన అంజలి క్షణికావేశంలో ఇంటిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు అంజలీని ఎన్‌. గుండ్లపల్లి ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయాన్ని అంజలి బంధువులకు చెప్పారు. గ్రామానికి చేరుకున్న బంధువులు... పోస్టుమార్టం నిమిత్తం అంజలి మృతదేహాన్ని తరలించే సమయంలో ఆమె ఒంటిపై కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనబడటంతో అనుమానం వచ్చి పరిశీలించారు. చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులే ఉరివేసుకుని చనిపోయినట్లుగా చిత్రికరించేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్ట్‌మార్టం చేయడానికి పోలీసులు సాయంత్రం 4.30 గంటల వరకూ  నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు రోడ్డుపై ధర్నా నిర్వహించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంతమంది వ్యక్తులు, వారి కుటుంబీకులతో పోలీసులు కుమ్మకై కమీషన్‌ల కోసం కక్కుర్తిపడి కేసును పక్కదోవ పట్టించేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గ్రామంలో గతంలో గాజుల ప్రమీలమ్మ, ఆమె కుమార్తె భారతీని  కూడా వారి బంధువులు హత్యలు చేసి కేసులు లేకుండా చేయడంలో కొంతమంది గ్రామస్తులు ఆరితేరారని చెప్పారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మల్లికార్జున ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు. పోస్ట్‌మార్టం చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఐపీసీ 394బి, 498 , రెడ్‌విత్‌ 34, 3, 4 డీపీఏ కేసులను ఆరుగురిపై నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు