యువకుడి అనుమానాస్పద మృతి

14 Feb, 2019 13:25 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది

 కన్న కొడుకును గుర్తించలేని మతిస్థిమితం లేని తల్లి

పరిగి మండలం పి.నరసాపురంలోని బిసప్ప గారి ఆంజనేయులు (24)     మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపాన వేపచెట్టు వద్ద విగత జీవిగా పడి ఉండటాన్ని తండ్రి బోయ సుబ్బరాయప్ప         గమనించి కన్నీరుమున్నీరయ్యాడు. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో     కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది.

అనంతపురం  , పరిగి: పి.నరసాపురంలో మోటారు పంపులు మరమ్మతులు, దినసరి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న బిసప్పగారి ఆంజనేయులు అవివాహితుడు. ఇతని తండ్రి సుబ్బరాయుడు కూడా కూలి పనులు చేస్తుండేవాడు. కొంత కాలంగా ఆంజనేయులు తల్లి సుబ్బమ్మ మతిస్థిమితం కోల్పోయింది. కూలి పనులు చేసుకుంటున్న ఆంజనేయులు మంగళవారం మధ్యాహ్నం నుంచి గ్రామంలో కనిపించకుండా పోయాడు. బుధవారం ఉదయం ఊరిబయటకు వెళ్లిన కొందరికి వేపచెట్టు వద్ద ఆంజనేయులు మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న హిందూపురం రూరల్‌ సీఐ సుబ్రమణ్యం, పరిగి ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ శేఖర్‌ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహం చూసి తండ్రి బోరున విలపించాడు. తల్లి అక్కడకు వచ్చినా కుమారుడిని గుర్తించలేని పరిస్థితి. 

మృతిపై అనుమానాలు
ఆంజనేయులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలి పనులతో బతుకుతున్న ఆంజనేయులు గతంలో గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ క్రమంలో ఆమె బంధువులే హత్య చేసి పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో మృతదేహం వద్ద ఓ టవల్‌ పడి ఉంది. ఆంజనేయులు చేతిపై ఉన్న పచ్చబొట్టు వద్ద, శరీరంలోను పలు చోట్ల గాయాలు కనిపిస్తున్నాయి.  

హత్య కోణంలో దర్యాప్తు
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆంజనేయులు హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురయ్యాడా.. ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు