నాన్నా.. మమ్మల్ని చూడు!

14 Mar, 2020 11:44 IST|Sakshi
తండ్రి మృతదేహం వద్ద బోరున విలపిస్తున్న కుమారులు (ఇన్‌సెట్‌) మృతిచెందిన వీరేష్‌

ట్రాక్టర్‌ తిరగబడి మిర్చి కూలీ మృతి  

మృతదేహం వద్ద కుమారులు కన్నీటిపర్యంతం  

గుంటూరు, ప్రత్తిపాడు: ‘నాన్న లే.. ఒక్కసారి మమ్మల్ని చూడు. పెద్దోడా.. చిన్నోడా.. అంటూ ఇంక మమ్మల్ని ఎవరు పిలుస్తారు. లే నాన్నా’ అంటూ కన్న కొడుకులు తండ్రి మృతదేహం వద్ద బోరున విలపించిన ఘటన నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా దుగ్గిలి మండలం రాతన గ్రామానికి చెందిన చాకలి వీరేష్‌ (43), లక్ష్మి  దంపతులు. వీరి కుమారులు వినోద్, శేఖర్‌. వీరికి 15 ఏళ్ల వయసుంటుంది. కలిసి కొద్ది నెలల కిందట వ్యవసాయ కూలి పనుల నిమిత్తం కుటుంబం మొత్తం ప్రత్తిపాడుకు వచ్చారు. లక్ష్మి మిర్చి కోతకు పొలం వెళ్లింది. కుమారులు కూడా మరో చోట మిర్చి కోతకెళ్లారు.

అదుపుతప్పి నక్కవాగులో తిరగబడ్డ ట్రాక్టర్‌
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వీరేష్‌ ఒక్కడే ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ ముందు టైర్‌  ఉన్నట్టుండి పేలింది. ట్రాక్టర్‌ పూర్తిగా అదుపు తప్పి నక్కవాగులోకి దూసుకువెళ్లి తిరగబడింది. భూమ్మీద ఉండాల్సిన నాలుగు చక్రాలు ఆకాశం వైపు చూసేంతగా జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ నడుపుతున్న వీరేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారులిద్దరూ ఘటనా స్థలానికొచ్చి తండ్రి మృతదేహం వద్ద బోరున విలపించారు. ‘నాన్నా లే.. మమ్మల్ని చూడు నాన్నా..’ అంటూ కన్నీటిపర్యంతమవడం చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని  ప్రత్తిపాడు ఏఎస్‌ఐ కె శివశంకర్‌ సింగ్‌ పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు