ఉద్యోగం ఇప్పిస్తానని యువతిపై అత్యాచారం

20 Jan, 2020 08:47 IST|Sakshi

డయల్‌ 100కు ఫోన్‌ చేసిన బాధితురాలు

నిందితుడు, అతని స్నేహితుడి అరెస్టు

రాంగోపాల్‌పేట్‌: రైల్‌లో పరిచయమైన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. డీఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర బుసావల్‌కు చెందిన ఓ యువతి (24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. చర్లపల్లి రైల్వే కాలనీకి చెందిన వివేకానంద (42) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. వ్యాపారం పనిమీద 15 రోజుల క్రితం మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడ స్నేహితుడి ద్వారా వివేకానందకు సదరు యువతి రైల్‌లో పరిచయమైంది. తనకు ఉద్యోగం కావాలని వివేక్‌తో చెప్పింది. దీంతో ఆమెకు తన మొబైల్‌ నంబర్‌ ఇచ్చాడు. రెండు వారాల నుంచి ఇద్దరు ఫోన్‌లో చాటింగ్‌ చేస్తున్నారు.  హైదరాబాద్‌ వస్తే ఉద్యోగం చూపిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ నెల 18న ఉదయం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్‌కు వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసింది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ యువతిని కారులో ఎక్కించుకున్నాడు.

కారులోనే స్నేహితుడితో కలిసి మద్యం తాగారు. యువతికి కొన్ని చిరుతిళ్లు బలవంతంగా తినిపించారు. దీంతో ఆమెకు కొద్దిగా మగతగా అనిపించడంతో తననను హోటల్‌ వద్ద డ్రాప్‌ చేయాలని చెప్పగా అతను నిరాకరించాడు. అనంతరం అక్కడే ఉన్న ఓ హోటల్‌కు మారాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో మరోసారి హోటల్‌కు రమ్మని చెప్పి రాత్రి 11.30 గంటల సమయంలో అక్కడ హోటల్‌ను తనే బుక్‌ చేశాడు. ఆమెను పైకి వెళ్లమని చెప్పి కొద్దిసేపటి తర్వాత తనతో పాటు ఉన్న రాజును కిందనే ఉంచి బ్యాగును తీసుకుని హోటల్‌ గదికి వెళ్లాడు. మళ్లీ ఎందుకు వచ్చావని ఆమె ప్రశ్నించడంతో బ్యాగు ఇచ్చేందుకు అని చెప్పి ఆమెను చంపుతానని బెదిరించాడు. అప్పటికే ఆమెకు కొద్దిగా మగతగా ఉండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి గదిలో నుంచి బయటకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు మెలకువ వచ్చింది. విషయం తెలుసుకుని 100 డయల్‌కు ఫోన్‌ చేసింది. వెంటనే గోపాలపురం డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ సదరు హోటల్‌కు వెళ్లి బాధితురాలి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం ఆమె నగరంలోనే ఉన్న బంధువులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న రాజు కారులో వివేక్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు నిందితుడు వివేక్‌తో పాటు అతనికి సహకరించిన రాజును ఆదివారం అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా