హవాలా రాకెట్‌ గుట్టు రట్టు

4 Apr, 2019 08:32 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

రూ.41లక్షల నగదు స్వాధీనం ఎనిమిదిమంది అరెస్టు

పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తం స్వాధీనం

జయభేరీ సిబ్బంది నుంచి రూ.2 కోట్లు

ఉత్తర మండలం పరిధిలో రూ.41లక్షలు

విజయవాడ హైవేపై రూ.48 లక్షలు..  

సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల వేళ పోలీసులు చేస్తున్నతనిఖీల్లో ‘కట్టల’కొద్దీ తరలిస్తున్న డబ్బు పట్టుబడుతోంది. బుధవారం పోలీసులు వివిధ ప్రాంతాల్లో సుమారు రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం పరిధిలో నగదు తరలిస్తున్న రెండు ముఠాల నుంచి రూ.41లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో రూ.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో జయభేరి ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమెకు అందించేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.  

రాంగోపాల్‌పేట్‌: గుట్టు చప్పుడు కాకుండా పెద్దమొత్తంలో నగదు తరలిస్తున్న రెండు ముఠాల గుట్టును ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టయలు చేశారు. ఈ సందర్భంగా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.41లక్షల నగదు, 10 సెల్‌ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  గౌలిగూడ చమాన్‌కు  చెందిన అభిషేక్‌ రాఠి ఎలక్ట్రికల్‌ వస్తువుల వ్యాపారం చేసేవాడు. అతను బేగంబజార్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి కమల్‌ శర్మ, ఇసామియాబజార్‌కు చెందిన హవాలా వ్యాపారి సుభాష్‌శర్మ, అదే ప్రాంతానికి చెందిన శ్యామ్‌ సుందర్, మల్లేపల్లికి చెందిన మహేష్‌కుమార్‌ పాండేతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.

వీరు నగదు అవసరమైన వారి హవాలా ద్వారా కమీషన్‌ ప్రాతిపదికన నగదు చేరవేసేవారు. ఇందుకు గాను 8 నంచి 10శాతం కమీషన్‌గా తీసుకునేవారు.  ఈ నేపథ్యలో బుధవారం అభిషేక్‌ రాఠి, కమల్‌ శర్మ పెద్ద మొత్తంలో నగదు సేకరించి సుభాష్‌శర్మ, శ్యామ్‌ సుందర్‌ ద్వారా దిల్‌సుక్‌నగర్‌లో స్క్రాప్‌ వ్యాపారం చేసే వీరబొమ్మల శ్రీశైలంకు అందించేందుకు   పథకం వేశారు. ఇందులో భాగంగా షాహినాయత్‌గంజ్‌లోని గోషా మహాల్‌రోడ్‌లో తచ్చాడుతుండగా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది దాడి చేసి ఆరుగురు  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం షాహినాయత్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. 

కిమ్స్‌ ఆస్పత్రి వద్ద రూ.15 లక్షలు స్వాధీనం
 రాజస్థాన్‌కు చెందిన శ్రవణ్‌సింగ్‌ రాజ్‌పుత్‌ హవాలా డెలివరీ ఏజెంట్‌గా పనిచేసేవాడు. బుధవారం సాయంత్రం అతను గచ్చిబోలికి చెందిన తమ్మినీడి వెంకటేశ్వరరావుకు హవాలా రూపంలో రూ.15లక్షల నగదు తీసుకుని మినిస్టర్‌ రోడ్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వద్దకు వచ్చారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు రాజమండ్రికి చెందిన వ్యక్తి కావడంతో సదరు నగదును ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో వినియోగించేందుకు తీసుకెళుతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు.

విజయవాడ జాతీయ రహదారిపై..రూ. 48 లక్షలు స్వాధీనం
పెద్దఅంబర్‌పేట: కారులో రూ.48లక్షల నగదును తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం  అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై రాచకొండ ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్‌ నుంచి నల్లగొండ  వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో రూ.48లక్షలు గుర్తించారు.  కారు డ్రైవర్‌ కె.సత్యపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నగదును నల్లగొండకు తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. నగదు  బాటసింగారంలోని వివేకానంద ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యానికి చెందినదిగా చెప్పినట్లు సీఐ దేవేందర్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని నగదును రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

మరో కారులో రూ.4.23లక్షలు..
కొత్తగూడెం చెక్‌పోస్ట్‌ వద్ద  వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన శ్రీనివాస్‌రావు అనే వ్యాపారి నుంచి రూ.4,23,830 నగదును స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు  అప్పగించారు.   

 రూ.1.98 లక్షలు స్వాధీనం
చాంద్రాయణగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.98 లక్షల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ జి.కోటేశ్వర్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం....బిస్మిల్లా కాలనీకి చెందిన అనీస్‌ బుధవారం కారులో రూ.1.98 లక్షల నగదు తీసుకెళుతుండగా చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారుల అప్పగించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు