కిడ్నీ రాకెట్‌లో మరికొన్ని ఆస్పత్రులు?!

14 May, 2019 12:49 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు

11 ఆస్పత్రులకు మార్పిడి అనుమతులు

వీటిపైనా దృష్టి సారించిన త్రిసభ్య కమిటీ సభ్యులు

సాక్షి, విశాఖపట్నం: ఏటా కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్న కిడ్నీ మార్పిడి వ్యవహారంలో విశాఖలోని మరికొన్ని ఆస్పత్రులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నీ మార్పిడికి చెల్లించే మొత్తం (సుమారు రూ.60 నుంచి 70 లక్షలు)లో సగానికి పైగా ఆస్పత్రులే కొట్టేస్తున్నాయి. కిడ్నీ దాతలకు మాత్రం మొక్కుబడిగా చెల్లించి చేతులు దులిపేసుకుంటున్నాయి. హైదరాబాద్‌కు చెందిన టి.పార్థసారథి అప్పులపాలై తన కిడ్నీని బెంగళూరులోని ప్రభాకర్‌కు రూ.12 లక్షలకు అమ్ముకోవడం, నగరంలోని శ్రద్ధ ఆస్పత్రి అందులోని రూ.5 లక్షలే చెల్లించి తర్వాత ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారం వెలుగు చూసింది. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా బ్రోకర్, ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్, కిడ్నీ మార్పిడి చేసిన శ్రద్ధ ఆస్పత్రి వైద్యుడు దొడ్డి ప్రభాకర్, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌ జేకే వర్మలను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న ప్రభాకర్‌ అనారోగ్యంతో ఉండడం వల్ల పోలీసులు ఇంకా అతడిని అరెస్టు చేయలేదు. పరారీలో ఉన్న అతని సోదరుడు వెంకటేష్, శ్రద్ధ ఆస్పత్రి ఎండీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆ ఆస్పత్రుల్లో అలజడి
కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై కలెక్టర్‌ కె.భాస్కర్‌ త్రిసభ్య కమిటీని వేశారు. తొలుత శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ బాగోతంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశాక, నగరంలో ఇంకా కిడ్నీ మార్పిడికి అనుమతి ఉన్న ఆస్పత్రులపై కూడా లోతుగా పరిశీలించాలని ఆదేశించారు. విశాఖ నగరంలో ఇలాంటి ఆస్పత్రులు 11 వరకు ఉన్నాయి. వీటిలో పేరున్న కార్పొరేట్‌ ఆస్పత్రులున్నాయి. వీటిలో చాలావరకు నిబంధనలు పాటించకుండానే అవయవ/కిడ్నీ మార్పిడిలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా ఆస్పత్రుల్లోనూ ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ ఆస్పత్రుల నిర్వాహకుల్లో ఇప్పుడు తీవ్ర అలజడి రేగుతోంది. శ్రద్ధ ఆస్పత్రి విషయంలో ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న మేరకు సొమ్ము చెల్లించి ఉంటే బాధితుడు ఫిర్యాదు చేసే అవకాశమే ఉండేది కాదు. కానీ బేరం బెడిసి కొట్టడంతో వెలుగులోకి వచ్చింది. నగరంలో కిడ్నీ మార్పిడిలు చేస్తున్న మిగతా ఆస్పత్రుల్లోనూ అడ్డదారి వ్యవహారాలే నడుస్తున్నట్టు తెలుస్తోంది. అవయవాల మార్పిడిలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. శ్రద్ధ ఆస్పత్రి బాగోతంతో ఇప్పుడు త్రిసభ్య కమిటీ మిగతా ఆస్పత్రులపైనా విచారణ ప్రారంభిస్తుంది. ఎంత మందికి కిడ్నీ/అవయవ మార్పిడి చేశారు? వారి చిరునామా? దాతల వివరాలు కూడా కూపీ లాగనుంది. వారం రోజుల్లోగా శ్రద్ధ ఆస్పత్రిపై విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సి ఉంది. అనంతరం మిగిలిన ఆస్పత్రుల్లో గడచిన ఐదేళ్లుగా ఎలాంటి అతిక్రమణలు జరిగాయో పరిశీలిస్తారు. త్రిసభ్య కమిటీ చిత్తశుద్ధికి ఇది పరీక్షగా మారనుందని వైద్య వర్గాలు చెప్పుకుంటున్నాయి.

శ్రద్ధ ఆస్పత్రి లైసెన్సు రద్దు చేయాలి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): కిడ్నీ మార్పిడి రాకెట్‌కు కేంద్రమైన శ్రద్ధ ఆస్పత్రి లైసెన్సుని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ఐక్యవేదిక చైర్మన్‌ జేటీ రామారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రేసపువానిపాలెంలో గల జిల్లా వైద్య – ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు స్పందించకుంటే తామే ఆస్పత్రికి తాళాలు వేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కమిటీలు, విచారణ పేరుతో జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ నాయకులు బి.నరసింహాచారి, శివాజీ, కిశోర్, పి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రద్ధపై విచారణ ప్రారంభం
శ్రద్ధ ఆస్పత్రిపై కలెక్టర్‌ నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం విచారణ చేపట్టింది. కమిటీ సభ్యులు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ బీకే నాయక్‌లు సోమవారం ఉదయం కేజీహెచ్‌లో సమావేశమయ్యారు. అనంతరం తిరుపతిరావు, నాయక్‌లతో కలిసి డాక్టర్‌ అర్జున్‌ మీడియాతో మాట్లాడారు. శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ రాకెట్‌ వ్యవహారం ‘సాక్షి’లో ప్రచురించడంతో కలెక్టర్‌ భాస్కర్‌ విచారణకు త్రిసభ్య కమిటీని వేశారని చెప్పారు. శ్రద్ధ ఆస్పత్రి ప్రారంభం నుంచి ఎన్ని కిడ్నీ మార్పిడులు జరిగాయో రికార్డులను పరిశీలిస్తామని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకుంటామని తెలిపారు. వారం రోజుల్లో నివేదిక ఇస్తామని, ఆ తర్వాత మిగిలిన ఆస్పత్రులపై దృష్టి సారిస్తామని చెప్పారు.

‘శ్రద్ధ’లో కనిపించని బాధ్యులు
త్రిసభ్య కమిటీ సభ్యులు వి చారణకు శ్రద్ధ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆస్పత్రిలో నిర్వాహకులుగానీ, పరిపాలనా విభాగ బాధ్యులుగానీ లేరు. ఇప్పటికే ఆస్పత్రి ఎండీ పరారీలో ఉన్నారు. కమిటీ సభ్యులు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించారు. కొన్నింటిని పో లీసులు తీసుకెళ్లినట్టు చెప్పారు. కమిటీకి అవసరమైన రికార్డులను పరిశీలన కోసం పోలీ సు విచారణాధికారి నుంచి తీసుకోనున్నారు. ఆ తర్వాత రోజూ శ్రద్ధ ఆస్పత్రిలోనే విచారణ చే యనున్నారు. ఈ ఆస్పత్రికి కిడ్నీ మార్పిడికి 2022వరకు అనుమతులుండగా, జీవన్‌దాన్‌కు మాత్రం గడువు ముగిసిందని గుర్తించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు