సామాన్యుడు విసిరిన సవాళ్లు! 

30 Nov, 2023 03:25 IST|Sakshi

2010లో స్లాట్స్‌ కోసం పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ 

2018లో సిమ్‌కార్డ్స్‌ టార్గెట్‌కి బయోమెట్రిక్‌ వ్యవస్థ విచ్చిన్నం 

తాజాగా వెలుగులోకి క్లోన్డ్‌ వేలిముద్రలతో ఏఈపీఎస్‌ దందా  

వ్యవస్థాగత లోపాలే కారణమంటున్న పోలీసు అధికారులు 

సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులు సైతం ఒక్కోసారి పెద్దపెద్ద వ్యవస్థల్ని కదిలిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ‘హైటెక్‌ నేరాలకు’ పాల్పడుతూ సవాళ్లు విసురుతున్నారు. వీరిస్తున్న షాక్‌లతో యంత్రాంగాల దిమ్మ తిరిగిపోయి నష్ట నివారణ చర్యలు అన్వేషిస్తున్నాయి. 2010లో వెలుగులోకి వచ్చిన పాస్‌పోర్ట్‌ కార్యాలయం వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ నుంచి తాజాగా బయటపడిన ‘క్లోన్డ్‌ వేలిముద్రల’ వ్యవహారం వరకు ఈ కోవకు చెందినవే. ఆయా నిందితులు ఈ నేరాలకు పాల్పడింది కేవలం తమ అవసరాల కోసమే కావడం గమనార్హం.  

స్లాట్స్‌ కోసం ఆర్పీఓ వెబ్‌సైట్‌... 
ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన గోరంట్ల లతాధర్‌రావు పీజీడీసీఏ పూర్తి చేసి అక్కడే లలిత ఫ్యాన్సీ అండ్‌ కూల్‌ డ్రింక్స్‌ దుకాణం నిర్వహించేవాడు. ఇతడికి 2010లో ఆకాష్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుడు షేక్‌ సుభానీతో పరిచయమైంది. లతాధర్‌కు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్‌పోర్ట్‌ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం కోసం సుభానీ ఇతని సాయం తీసుకునే వాడు.

తత్కాల్‌ స్కీమ్‌ కింద పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించి ఆన్‌లైన్‌ స్లాట్‌ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందు రావడం మొదలుపెట్టారు. దీంతో పాస్‌పోర్ట్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి స్లాట్స్‌ బ్లాక్‌ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తనకున్న కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని వినియోగించి లతాధర్‌ ఈ పని చేశాడు. రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం వెబ్‌సైట్‌లోనికి ఎంటర్‌ అయ్యే లతాధర్‌ దాని నుంచి నేరుగా సర్వర్‌కు కనెక్ట్‌ అయ్యే వాడు.

ప్రతి రోజూ స్లాట్స్‌ విడుదల చేసే సమయంలో ఇతరులు వాటిలోకి లాగాన్‌ కాకుండా చేసే వాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్‌ అప్‌లోడ్‌ చేసిన తరవాతే స్లాట్స్‌ను ఫ్రీ చేసే వాడు. ఈ వ్యవహారం అదే ఏడాది జూన్‌లో వెలుగులోకి రావడంతో టాస్‌్కఫోర్స్‌ పోలీసులు లతాధర్‌ సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ స్లాట్స్‌ కేటాయింపునకు ఉపయోగపడే పాస్‌పోర్ట్‌ వెబ్‌సైట్‌కు చెందిన సోర్స్‌ కోడ్‌ను హ్యాక్‌ చేయడం ద్వారా ఇతరులకు స్లాట్స్‌ దొరక్కుండా బ్లాక్‌ చేస్తున్నట్లు లతాధర్‌ ఒప్పుకున్నాడు.  

టార్గెట్, నగదు కోసం నకిలీ వేలిముద్రలు... 
కేవలం టార్గెట్‌కు తగ్గట్టు సిమ్‌కార్డులు విక్రయించడానికి పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్‌ నిర్వాహకుడు పాత సంతోష్‌కుమార్‌ ఏకంగా నకిలీ వేలిముద్రల్నే సృష్టించేశాడు. ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం అదే ప్రథమం. రిజిస్ట్రేషన్ న్స్‌ శాఖ వెబ్‌సైట్‌లోని డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని రెచ్చిపోయాడు. వాటిలో ఉండే వ్యక్తి పేరు, ఆధార్‌ నెంబర్, వేలిముద్రల్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు.

రబ్బర్‌స్టాంపులు తయారు చేసే యంత్రంతో వేలిముద్రల్నే సృష్టించేశాడు. రబ్బర్‌తో వీటిని రూపొందిస్తే ఈ–కేవైసీ యంత్రం రీడ్‌ చేయట్లేదనే ఉద్దేశంతో పాలిమర్‌ అనే కెమికల్‌ను వాడి వేలిముద్రలు తయారు చేశాడు. ఈ వివరాలతో ఈ–కేవైసీ యంత్రాన్నీ ఏమార్చి వేల సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేశాడు. ఇతడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు పట్టుకున్న తర్వాత వచ్చి విచారించిన ఆధార్‌ సహా ఇతర విభాగాలకు చెందిన అధికారులు నివ్వెరపోయారు.

తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముఠాగా మారి, ఇదే పంథాలో వేలిముద్రలు క్లోనింగ్‌ చేసి ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌) దురిజిస్ట్రేషన్ నియోగం చేసి వివిధ బ్యాంకులకు రూ.10 లక్షల మేర టోకరా వేశారు.  

‘ముప్పు’ను ఊహించకపోవడమే... 
ఇలాంటి పెను ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ‘భవిష్యత్తును’ సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఓ విధానం, వెబ్‌సైట్‌ తదితరాలు రూపొందించేప్పుడు అనేక కోణాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే పెద్ద వ్యవస్థలకు చెందిన వారు సైతం కేవలం అప్పటి అవసరాలను, ఎదురవుతున్న సమస్యల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని పట్టించుకోవట్లేదని వివరిస్తున్నారు.

ఈ కారణంగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మాత్రమే నష్టనివారణ, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం సమీప భవిష్యత్తులో ఎన్ని రకాలైన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది, టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు తదితరాలను అంచనా వేసి చర్యలు తీసుకుంటారని, ఆ దృక్పథం ఇక్కడ లోపించిందని, దీంతోనే ఏదైనా జరిగిన తర్వాతే అవసరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు