జైలు నుంచి హెలికాఫ్టర్‌లో గజదొంగ పరారీ

1 Jul, 2018 18:17 IST|Sakshi
పరారైన గజదొంగ ఫెయిద్‌

పారిస్‌: పెద్ద పెద్ద దోపిడీలకు పాల్పడిన ఓ గజదొంగ ధైర్యంగా జైలు నుంచి తప్పించుకున్నాడు. అది ఎలాగంటే ఏకంగా హెలికాఫ్టర్‌ తెప్పించుకుని పరారయ్యాడు. ఈ సంఘటన ఫ్రాన్స్‌ దేశంలోని పారిస్‌లో జరిగింది. పారిపోయేటపుడు మరో ముగ్గురు ఖైదీలను కూడా వెంటబెట్టుకుని తీసుకుపోయాడు. ఫ్రాన్స్‌లోని క్రెయిల్‌ ప్రాంతానికి చెందిన ఫెయిద్‌ రెడోయిన్‌(46) చిన్నప్పటి నుంచే చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. ఫెయిద్‌ యవ్వనమంతా నేరమయమే. 2010 సంవత్సరం మే నెలలో ఆయుధాలతో కలిసి దోపిడీ పాల్పడ్డాడు. ఆ సమయంలో పోలీసులకు, ఫెయిద్‌ సహచరులకు మధ్య తుపాకి కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఓ పోలీసు అధికారిణి కూడా చనిపోయింది. ఆ తర్వాత ఫెయిద్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫెయిద్‌కు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఫెయిద్‌ 2013లో జైలు తప్పించుకునేందకు పథకం రచించాడు. డైనమైట్‌లు ఉపయోగించి జైలు గోడలు బద్దలు కొట్టి తప్పించుకున్నాడు. ఆరు వారాల తర్వాత పోలీసులు ఫెయిద్‌ను మళ్లీ పట్టుకున్నారు. ఈ సారి జైలు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌నే వాడుకున్నారు.

ఆదివారం నాటి సంఘటనలో ఆయుధాలతో హెలికాప్టర్‌లో వచ్చిన ఫెయిద్‌ అనుచరులు చాకచక్యంగా నిమిషాల్లో జైలు నుంచి తప్పించుకున్నారు. తప్పించుకునేందుకు వాడిన హెలికాప్టర్‌ను పారిస్‌ శివార్లలో పోలీసులు తర్వాత కనుగొన్నారు. పారిపోయిన వారి కోసం పోలీసులు పారిస్‌ అంతా జల్లెడ పడుతున్నారు. ఫెయిద్‌ గతంలో పలు టీవీ ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అలాగే రెండు పుస్తకాలకు సహ రచయితగా కూడా వ్యవహరించాడు. స్కార్‌ఫేస్‌, హీట్‌ అనే రెండు హాలీవుడ్‌ సినిమాలు తన జీవితం నేరమయం కావడానికి ప్రేరేపించాయని ఒకానొక సందర్భంలో ఫెయిద్‌ చెప్పినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు