వక్రీకరించిన విధి

12 Mar, 2018 12:58 IST|Sakshi
పద్మ(ఫైల్‌ ఫొటో) ,కాలిన గాయాలతో చిన్నారి

 పితాతొళిలో విషాదం

విశాఖలో అగ్నిప్రమాదం

ఫిబ్రవరి 12న ఘటన  

చికిత్స పొందుతూ భార్య మృతి

భర్తకు తీవ్రగాయాలు.. కాలిన గాయాలతో చిన్నారి

చిత్రంలో కాలిన గాయాలతో కనిపిస్తున్న చిన్నారి పేరు ప్రేమ్‌కుమార్‌. వయస్సు 14 నెలలు. నెల రోజులుగా వచ్చీ రాని మాటలతో అమ్మా.. అని పిలుస్తున్నా ఆ తల్లి కనిపించడం లేదు. నాన్నా.. అని అరుస్తున్నా ఆ తండ్రి హత్తుకోవడం లేదు. అమ్మకు ఏమైందో తెలీక, నాన్న ఎందుకు రావడం లేదో అర్థం కాక ఈ బుజ్జాయి ఏడుస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 12న విశాఖలో జరిగిన గ్యాస్‌ ప్రమాదంలో ఈ చిన్నారి తల్లిదండ్రులు గాయపడ్డారు. తల్లి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయారు. తండ్రి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈ విషాదంతో మందస మండలం పితాతొళి గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది.

శ్రీకాకుళం, మందస: ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతానికి వెళ్లిన కుటుంబంపై విధి పగబట్టింది. అందమైన కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తల్లి మరణించింది. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తల్లిదండ్రుల గుండెలపై ఆడుకోవాల్సిన చిన్నారి.. ఏం జరిగిందో తెలియక.. అమాయకంగా అమ్మా.. నాన్నా.. అని పిలుస్తున్న దృశ్యం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.

ఊహించని ప్రమాదంతో..
మందస మండలంలోని పితాతొళి గ్రామానికి చెందిన బాడ గిరిబాబు(30) స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో పదేళ్లుగా తిరుగుతున్నారు. మూడేళ్ల క్రితం విశాఖపట్నం వచ్చి.. దువ్వాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో చేరారు. కూర్మన్నపాలెంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 12న రాత్రి 11.30 సమయంలో గ్యాస్‌ వాసన రావడంతో మేల్కొన్న గిరిబాబు లైట్‌ వేశాడు. ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ప్రమాద తీవ్రత గుర్తించిన గిరిబాబు.. ఉయ్యాలలో నిద్రిస్తున్న 14 నెలల కుమారుడు ప్రేమ్‌కుమార్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గిరిబాబు 60 శాతం, భార్య పద్మ(23).. 75 శాతం   కాలిపోయారు.  చుట్టుపక్కలవారు మంటలను అదుపు చేశారు.

కుటుంబసభ్యుల్లో ఆందోళన
గిరిబాబు, పద్మ, ప్రేమ్‌కుమార్‌ను విశాఖలోని కేజీహెచ్‌లో చేర్పించారు. పద్మ మృత్యువుతో పోరాటం చేసి ఓడిపోయింది. ఆమె ఇటీవలే కేజీహెచ్‌లో మరణించినట్టు పితాతొళిలోని బంధువులకు సమాచారం అందిచారు. గిరిబాబు కూడా మృత్యువుతో పోరాడుతుండటంతో తల్లిదండ్రులు కూరాకులు, సరోజనమ్మతో పాటు అన్నయ్య శ్రీనివాసరావు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోడలిని కోల్పోయిన దుఃఖంలో ఉండగా.. కొడుకు మృత్యువుతో పోరాడుతుండటం వారిని మరింత కుంగదీస్తోంది. ముక్కు, నోరు, బుగ్గలపై కాలిన గాయాలతో ప్రేమ్‌మార్‌ దీనంగా చూస్తున్న చూపులు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన వారిపై పగ పట్టినట్టు జరిగిన ఈ సంఘటన స్థానికుల హృదయాలను ద్రవింపజేస్తోంది.

మరిన్ని వార్తలు