చపాతీ కూరలో 30 నిద్రమాత్రలు.. ఆపై ఉరి

25 Aug, 2018 11:27 IST|Sakshi
నిందితులు గోవింద్‌, పద్మావతి

వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చాడనే...

కన్న కొడుకుని మట్టుబెట్టిన తల్లి

ఆమెకు సహకరించిన ప్రియుడు

ప్రియుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

విజయనగరం టౌన్‌ : తన వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డువచ్చాడనే కారణంతో కన్నకొడుకుని ఓ తల్లి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే..  ఈ నెల 22వ తేదీ రాత్రి స్థానిక గాయత్రీనగర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన హరి భగవాన్‌ (17) తల్లి వెంకట పద్మావతిని పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. హత్య కేసులో తల్లి వెంకట పద్మావతితో పాటు ఆమె ప్రియుడు గోవింద్‌ హస్తం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం సబ్‌జైల్‌కు పంపించినట్లు రూరల్‌ సీఐ రమేష్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు.  

అసలేం జరిగింది?

గాయత్రీనగర్‌లో నివాసముంటున్న వెంకట పద్మావతికి 2000లో కొండబాబుతో వివాహం జరిగింది. వారికి హరిభగవాన్‌ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. కొండబాబు డ్రైవింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే సంపాదన విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2012లో కొండబాబు నుంచి పద్మావతి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి  గాయత్రీనగర్‌లోని తన సొంతిం టిలో పిన్ని సీతాలక్ష్మి, పిల్లలతో నివాసముంటోంది.

ఏజెంట్‌గా పరిచయం...

వెంకటపద్మావతి కొన్ని ప్రైవేట్‌ సంస్థలకు ఏజెంట్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యలో గోవింద్‌ అనే రియల్టర్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి సహించని కుమారుడు హరిభగవాన్‌ తల్లిని పలుమార్లు హెచ్చరించాడు. 

హత్యకు ముందస్తు పథకం

వెంకటపద్మావతి, గోవింద్‌ల కార్యకలాపాలకు అడ్డుగా ఉన్న హరి భగవాన్‌ను తప్పించాలనే ఉద్దేశంతో గోవింద్‌ ఇచ్చిన పథకాన్ని అమలుచేయడానికి పద్మావతి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరకు నిద్రమాత్రలు ఇచ్చి హరి భగవాన్‌ను అడ్డు తొలగించుకోవాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మావతి పిన్ని సీతాలక్ష్మి  తన సోదరుడు విశ్వనాథరాజుకు ఆరోగ్యం బాగోలేనందున బాబామెట్టకు వెళ్లింది. హరిని చంపాలంటే ఇదే సమయమని గోవింద్‌ తన ప్రియురాలు పద్మావతికి చెప్పాడు. పైగా గోవింద్‌ తన ఇంటి నుంచి ఎప్పటికప్పుడు ఫోన్‌లో హత్య ఎలా చేయాలో వివరించడం విశేషం.  

చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపి..

గోవింద్‌ సలహా మేరకు పద్మావతి చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపింది. దీంతో చపాతి తిన్న హరిగోపాల్‌ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నిద్రలోకి జారుకున్న కొడుకు మెడకు చీర బిగించి హత్యచేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి, మార్కులు తక్కువగా రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన పద్మావతి పిన్ని సీతాలక్ష్మికి హరి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆశ్చర్యపోయింది. పద్మావతిని గట్టిగా నిలదీయడంతో చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయింది.  ఇదిలా ఉంటే హత్యకు పరోక్షంగా సహకరించినా గోవింద్‌ను శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో వీరిద్దరిని రిమాండ్‌ నిమిత్తం సబ్‌జైల్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు