నూతన దాంపత్యంపై విధి కన్నెర్ర

23 Oct, 2018 07:53 IST|Sakshi
ఘటనా స్థలంలో పడి ఉన్న సూర్యనారాయణ మృతదేహం

ట్రాక్టర్‌ను ఢీకొని భర్త దుర్మరణం

పెళ్లైన నాలుగు నెలలకే మృత్యుఒడిలోకి

గుండెపగిలేలా రోదిస్తున్న భార్య

శ్రీకాకుళం, టెక్కలి రూరల్‌: ఆ నూతన దాంపత్యంపై విధి కన్నెర్ర జేసింది. ఎంతో ఆనందంగా ఉన్న ఆ దంపతులపై విధికి కన్నుకుట్టింది. పెళ్లైన నాలుగు నెలలకే తన భర్తను ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కాటేసింది. ఈ విషయం తెలుసుకున్న భార్య చెందిన ఆవేదన అరణ్యరోదనగా విగిలిపోయింది. అప్పటివరకు తన పక్కనే ఉన్న భర్త ఇప్పుడే టెక్కలి వెళ్లివస్తానని చెప్పి 10 నిమిషాలు గడవక ముందే మృత్యువు వడిలోకి చేరాడనే వార్త వినడంతో ఆమె గుండె పగిలింది. ఈ ఘటన టెక్కలి మండలం గూడేం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన పువ్వల సుర్యానారాయణ(32) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సన్యాసి నీలాపురం గ్రామ సమీపంలో వంశధార వంతెనపై ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... మృతుడు సూర్యనారాయణకు నాలుగు నెలల క్రితం మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మితో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత సూర్యనారాయణ ఉపాధి నిమిత్తం చెన్నై వెళ్లి అక్కడ పనిచేస్తున్నాడు.

దసరా పండుగ సందర్భంగా సూర్యనారాయణ తన భార్య శ్రీలక్ష్మితో కలిసి ఆదివారం తమ గ్రామమైన గూడెం వచ్చాడు. అయితే ఇంట్లో అందరితో కలిసి ఆనందంగా ఉన్నారు. సోమవారం రాత్రి తన భార్యతో టెక్కలి వెళ్లి ఇప్పుడే వస్తానని చెప్పి బైక్‌పై వెళుతుండగా సన్యాసి నీలాపురం గ్రామం సమీపంలో వంశధార బ్రిడ్జి వద్ద కంకర లోడ్‌తో ఆగివున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. పెళ్లైన నాలుగు నెలలకే భర్త మృతిచెందటంతో భార్య రోదన వర్ణనాతీతం. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్‌ఐ సురేష్‌ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆదివారం ఉరివేసుకుని మృతిచెందగా, 24 గంటలు గడవక ముందే ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ట్రాక్టర్‌ను ఢీకొని మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు