మ్యాట్రి‘మనీ’ మోసాలు

31 Jan, 2019 09:57 IST|Sakshi

డబ్బుల కోసమే తప్పుడు ప్రొఫైల్స్‌తో యువతులకు ఎర

బాధితుల నుంచి భారీగా వసూళ్లు

పలువురు ఎన్నారైలు, సిటీవాసులపై షీటీమ్‌ కేసులు

సాక్షి, సిటీబ్యూరో: పెళ్లిళ్లకు ఆన్‌లైన్‌ వేదికైన మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్‌ సృష్టించి యువతులను మోసం చేస్తున్న పలువురు ఎన్నారైలు, సిటీవాసులపై సైబరాబాద్‌ షీ బృందాలు కేసులు నమోదు చేశాయి. గతంలోనే వివాహం జరిగినా విషయం దాచి పెళ్లి పేరుతో యువతులతో సన్నిహిత్యం పెంచుకొని, అదే నమ్మకంతో భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం డబ్బుల కోసమే మ్యాట్రిమోనీ సైట్‌లో తప్పుడు ప్రొఫైల్స్‌తో యువతులకు వల వేసి మోసం చేస్తున్నట్లు పలు కేసులు స్పష్టం చేస్తున్నాయని షీటీమ్స్‌ ఇన్‌చార్జి అనసూయ అన్నారు. ఈ విషయంలో యువతులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వరుడిని నేరుగా కలిసి అన్నీ వివరాలు తెలుసుకున్న తర్వాతే పెళ్లి విషయంలో అడుగు ముందుకు వేయాలని ఆమె సూచించారు. 

మరో యువతితో సంబంధం కొనసాగిస్తూనే...
మాదాపూర్‌కు చెందిన ఓ యువతి భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం కొత్త జీవితం కోసం మ్యాట్రిమోనీలో డైవోర్స్‌డ్‌ పీపుల్స్‌ పేజీలో రిజిష్టర్‌ చేసుకుంది. అదే సైట్‌లో రిజిష్టరైన ఎన్‌ఆర్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌  దుబాయ్‌లో పనిచేస్తున్నానని తాను కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రొఫైల్‌లో పొందుపరిచాడు. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడుకోవడంతో పాటు ఆరు నెలల పాటు వాట్సాప్‌ చాటింగ్‌ చేసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులకు అతడిని పరిచయం చేయడంతో పెళ్లికి అంగీకరించారు. అయితే అతను ఇండియాకు రాకపోవడంతో బాధితురాలే అతడిని కలిసేందుకు దుబాయ్‌కి వెళ్లింది. ఆమెతో నెలరోజుల పాటు హోటల్‌ గదిలో సహజీవనం చేశాడు. అదే సమయంలో అతను మరో యువతితో సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుండటాన్ని గుర్తించిన బాధితురాలు తనను మోసం చేశాడంటూ సైబరాబాద్‌ షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పెళ్లి పేరుతో రూ.లక్షలు వసూలు...
అల్కపూరి టౌన్‌షిప్‌కు చెందిన బాధితురాలు 2017లో భర్త నుంచి విడాకులు తీసుకొంది. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. అప్పటికే ఆ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న నిందితుడు ఈమె ప్రొఫైల్‌ను లైక్‌ చేశాడు. సొంత వ్యాపారం చేస్తున్న తాను ఆర్థికంగా బాగున్నట్లు నమ్మబలికాడు. రోజూ సెల్‌లో చాటింగ్‌ చేస్తూ తన కుటుంబసభ్యులందరినీ పరిచయం చేశాడు. కొన్ని రోజుల తర్వాత కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నానని కొంత సహాయం చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు పలు దఫాలుగా రూ.12 లక్షలు ఇచ్చింది.ఓ రోజూ బాధితురాలి ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితు రాలుషీ బృందానికి ఫిర్యాదు చేయడంతో నార్సింగ్‌ ఠాణాలో కేసు నమోదు చేసి నిందితుడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

తగినవాడు కాదన్నందుకు...
బీహెచ్‌ఈఎల్‌ ఆశోక్‌నగర్‌కు చెందిన ఓ యువతికి ఐదు నెలల క్రితం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా వినయ్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేసుకోవడమేగాక పలుమార్లు వ్యక్తిగతంగా కలిశారు. అయితే అతడి ప్రవర్తన నచ్చక తనకు సరైనవాడు కాదని ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు వేరొక పెళ్లి చేయాలని నిశ్చయించారు. బాధితురాలి ఎంగేజ్‌మెంట్‌ విషయం తెలుసుకున్న నిందితుడు ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయడంతో నిశ్చితార్థం ఆగిపోయింది. తనను కలిసినప్పుడు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలు, చాటింగ్‌ మెసేజ్‌లను చూపించి బెదిరించడంతో బాధితురాలి షీ బృందానికి ఫిర్యాదు చేసింది. ఆర్‌సీపురం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.   

తప్పుడు సమాచారంతో మోసం...
షాపూర్‌నగర్‌కు చెందిన యువతి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా ఓ వ్యక్తి ప్రొఫైల్‌ నచ్చడంతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. నిశ్చితార్థం సమయంలో సొంతిళ్లు ఉందని, ఇసుక వ్యాపారం చేస్తానని చెప్పిన నిందితుడు రోజుకు రూ.6వేల ఆదాయం ఉంటుందని నమ్మించాడు. అయితే మూడురోజుల తర్వాత బాధితురాలి తల్లిదం డ్రులు నిందితుడి తల్లిని సంప్రదించగా ఇల్లు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పింది.దీంతో అనుమానం వచ్చిన వారు విచారణ చేయగా నిందితుడికి ఎలాంటి ఆదాయం లేదని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలడంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో తననే పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఆమె నగ్నచిత్రాలను సృష్టించి ఇతరులకు పంపుతానంటూ బెదిరించడంతో బాధితురాలు షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది.  జీడిమెట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెళ్లి చేసుకుంటానంటూ...
కొండాపూర్‌కు చెందిన బాధితురాలికి మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను ఆమెను ఢిల్లీకి పిలిపించాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెను కలిసి గుర్గావ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. వారం రోజుల పాటు అక్కడే ఉంచుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌కు వచ్చి పెళ్లి చేసుకుంటానని అతను తిరిగిరాకపోవడంతో బాధితురాలు నేరుగా గుర్గావ్‌లోని అతడి ప్లాట్‌కు వెళ్లింది. తాను గర్భవతిని అని చెప్పడంతో మాత్రలు ఇచ్చి అబార్షన్‌ అయ్యేలా చూశాడు. ఆ తర్వాత అతడికి అప్పటికే వివాహం జరిగిందని, కుమార్తె కూడా ఉన్నట్లు తెలుసుకున్న బాధితురాలు షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు