ఏసీబీ వలలో అవినీతి చేప

11 Oct, 2019 08:26 IST|Sakshi
లంచం తీసుకున్న నగదుతో పట్టుబడిన సీఈ ఆనందం

రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కేటీపీఎస్‌ సీఈ

మెటీరియల్‌ కాంట్రాక్టర్‌ నుంచి రూ.10 లక్షలు డిమాండ్‌

ఏకకాలంలో సీఈ కార్యాలయం, గెస్ట్‌హౌస్‌లో సోదాలు 

ఉద్యోగుల్లో కలకలం రేపిన ఘటన 

సాక్షి, పాల్వంచ: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(కేటీపీఎస్‌) 5,6 దశల చీఫ్‌ ఇంజ నీర్‌ కె.ఆనందం ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యా హ్నం 12.45 నిమిషాలకు ఏసీబీ డీఎస్పీ ప్రతా ప్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌లో రూ.3లక్షల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో సీఈ కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఉండే జెన్‌కో గెస్ట్‌హౌస్‌లోనూ సోదాలు చేశారు. డీఎ స్పీ ప్రతాప్‌ కథనం ప్రకారం.. కేటీపీఎస్‌ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్‌æ(మిషనరీ స్పేర్‌ పార్ట్స్‌) సప్లయ్‌ కాంట్రాక్ట్‌ను పాల్వంచకు చెందిన వాహిని ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ కాంట్రాక్టర్‌ లలిత్‌ మోహన్‌ నిర్వహిస్తున్నాడు. గత జూ లైలో టెండర్లకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, అదే నెల చివరి వారంలో 21 రకాల పనులను రూ.71లక్షలకు దక్కించుకున్నాడు. మెటీరియల్‌ సప్లయ్‌ చేసినందుకు 7 పనులకు రూ.28లక్షల బిల్లులు ఇచ్చారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులు చేయా ల్సిఉంది. ఈక్రమంలో ఈనెల 1న సీఈ ఆనం దం కాంట్రాక్టర్‌ లలిత్‌ మోహన్‌ను పిలిపించి టెండర్ల బిల్లులు చేసినందుకు తనకు రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకుంటే వర్క్‌ ఆర్డర్‌ను రద్దు చేసేలా చూస్తానని బెదిరించాడు. దీంతో లలిత్‌ మోహన్‌ రూ.2లక్షల లంచం ఇచ్చాడు. మరో రూ.3లక్షలు 10వ తేదీన ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.  

ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్‌.. 
మెటీరియల్‌ సప్లయ్‌ పనుల్లో తనకు వచ్చే లాభం డబ్బును సీఈ అడగడంతో లలిత్‌ మోహన్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఖమ్మం డీఎస్పీ ప్రతాప్‌ సూచనల మేరకు రూ.3లక్షలు తీసుకుని సీఈ కె.ఆనందంకు గురువారం అందించాడు. కాగా, ముందస్తు పధకం ప్రకారం అక్కడికి వచ్చిన డీఎస్పీ ప్రతాప్, సీఐలు రవి, రమణమూర్తి, పీఆర్‌ ఏఈ ఇర్ఫాన్, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.వి.రాఘవేందర్, మరో పది మంది సిబ్బంది కలిసి ఆనందం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఈని అదుపులోకి తీసుకుని, శుక్రవారం హైదరాబాద్‌ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.   

ఏకకాలంలో సోదాలు..  
సీఈ కార్యాలయంలో అతడిని పట్టుకోవడంతో పాటు జెన్‌కో కాలనీలో సీఈ నివాసం ఉంటున్న గెస్ట్‌ హౌస్‌లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కంప్యూటర్‌లో ఉన్న వివరాలను సైతం పరిశీలించారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లోని ఉద్యోగుల్లో కలకలం రేపింది. ప్రజాహిత బ్రహ్మకుమారీస్‌ సంస్థ కీలక బాధ్యుడిగా, కర్మాగారంలో నిత్యం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సీఈ లంచావతారంలో దొరకడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కర్మాగారంలో కార్మికులకు సైతం ఆధ్యాత్మిక పుస్తకాలు, కరపత్రాలు, జ్ఞాపికలు పంపిణీ చేయడం, వారికి దైవ సూక్తులు బోధించడం వంటి పనులు చేసే వ్యక్తి ఇలా చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు.

ఇబ్బంది వల్లే ఏసీబీని ఆశ్రయించా 
కేటీపీఎస్‌ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్‌ సప్లయ్‌ చేసేందుకు రూ.71లక్షల పనులను టెండర్ల ద్వారా దక్కించుకున్నాం.   7 పనులకు రూ.28లక్షల బిల్లులు చేశారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులకు సీఈ రూ.10లక్షలు లంచం అడిగాడు. లేదంటే మిగితా బిల్లులు ఆపేస్తానని, భూపాలపల్లిలో కూడా బిల్లులు రాకుండా చేస్తానని బెదిరించాడు. ఈ పనులన్నీ గత సీఈ టీఎస్‌ఎన్‌ మూర్తి హయాంలోనే నాకు దక్కాయి. 15 సంవత్సరాలుగా నేను పనులు చేస్తున్నా.. ఏనాడూ ఏ అధికారీ డబ్బులు అడగలేదు. ఇప్పుడు సీఈ ఆనందం పెద్ద మొత్తంలో అడగడం ఇబ్బంది కలిగించింది. అందుకే ఏసీబీ వారిని ఆశ్రయించా.              
 – లలిత్‌ మోహన్, కాంట్రాక్టర్‌ 

లంచం అడిగితే 1064కు కాల్‌ చేయండి 
ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు కాల్‌ చేయండి. ఈ నంబర్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ చేసిన బాధితులకు తప్పక సహకరిస్తాం. అవసరమైతే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు.  
– ప్రతాప్, ఏసీబీ డీఎస్పీ 

మరిన్ని వార్తలు