గోదావరిలో యువకుడి గల్లంతు

7 Jan, 2018 20:32 IST|Sakshi

రెండు రోజులుగా వెతుకుతున్నా లభించని ఆచూకీ 

పలిమెల: ఛత్తీస్‌గఢ్‌ నుంచి పిక్నిక్‌ కోసం వచ్చిన బృందంలోని ఓ యువకుడు గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన మండలంలోని దమ్మూరు గ్రామం సమీపంలో శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ బ్లాక్‌ కాలనీకి చెందిన ఖుజూర్‌ అభిషేక్‌(22) ఐటీఐ చదువుతున్నాడు. అతడు తన మిత్రులతో కలిసి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను విడదీస్తూ మూడు నదుల సంగమ ప్రాంతానికి వచ్చాడు. అప్పటివరకు ఎంతో ఆనందంగా గడిపిన అభిషేక్‌ స్నానం కోసం నదిలోకి దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నీటి అడుగున ఉన్న ఇసుకలో దిగబడిపోయాడు. ఈత రాని అతడు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ ప్రవాహ ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితులకు సైతం ఈత రాకపోవడంతో అభిషేక్‌ను కాపాడే సాహసం చేయలేకపోయారు. వారు కేకలు వేయగా సమీపంలోని జాలర్లు అక్కడికి చేరుకునేలోపే అభిషేక్‌ కనిపించకుండా పోయాడు. యువకుడి గల్లంతుపై సమాచారం అందుకున్న ఛతీస్‌గఢ్‌లోని భద్రకాళి పోలీసులు అక్కడికి వచ్చి జాలర్లకు సహాయాన్ని అందిస్తున్నారు. రెండు రోజులుగా గాలించినప్పటికీ అభిషేక్‌ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టేందుకు సహకరించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు