చిన్న గొడవ.. ప్రాణం తీసింది

13 Oct, 2019 08:57 IST|Sakshi
రాస్తారోకో చేస్తున్న బంధువులు (ఇన్‌సెట్‌.. మృతి చెందిన తిరుమాల్‌)

తేని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌–2 విద్యార్థి మృతి

బంధువుల రాస్తారోకో

సాక్షి, చెన్నై : స్నేహితుడిని ఆటపట్టించాలని చేసిన చిన్న పని ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన శుక్రవారం తేనిలో చోటుచేసుకుంది. వివరాలు.. అల్లీనగరమ్‌ కంబర్‌ వీధికి చెందిన మురుగన్‌ భవన నిర్మాణ కార్మికుడు. ఇతని కుమారుడు తిరుమాల్‌ (17) అల్లినగరమ్‌ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌ 2 చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో ఉండగా ఓ స్నేహితుడు తిరుమాల్‌ నడుముని గిల్లాడు. అలా చేయొద్దని హెచ్చరించిన తిరుమాల్‌.. క్లాస్‌ రూంలోకి వెళ్లాడు. అతన్ని వెంబడిస్తూ అతని స్నేహితుడు సైతం వెళ్లాడు. మరలా అదే పనిచేయడంతో ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. ఆగ్రహించిన స్నేహితుడు తిరుమాల్‌ గొంతు పట్టుకుని నులిమాడు. దీంతో తిరుమాల్‌ స్పృహ తప్పి పడ్డాడు. ఇది చూసిన తోటి విద్యార్థులు కేకలు వేయడంతో ఉపాధ్యాయులు అతన్ని హుటాహుటిన తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే తిరుమాల్‌ మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తిరుమాల్‌ బంధువులు పాఠశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తేని పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమాల్‌ మృతికి కారణమైన విద్యార్థిన్ని(17) పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు