ఈ కేటుగాడు... ఒకప్పటి ‘ఆటగాడు’

31 Jul, 2019 08:08 IST|Sakshi
నెల్లూరు పోలీసుల అదుపులో నిందితుడు, (వృత్తంలో) నాగరాజు  

క్రికెట్‌లో రాష్ట్ర స్ధాయి క్రీడాకారుడు

నేడు పలు కేసుల్లో కటకటాల పాలు

శ్రీకాకుళం జిల్లా.. పోలాకి మండలం.. ప్రియాగ్రహారం పంచాయతీ పరిధిలో.. శివారు గ్రామం యవ్వారిపేట.. ఇప్పుడు ఈ మాట అందరినోటా విన్పిస్తుంటే అక్కడేదో గొప్ప విషయం జరిగిందని అనుకునేరు. కానే కాదు.. మారుమూల పేటలో నివాసం ఉంటున్న యువకుడు బుడుమూరు నాగరాజు అలియాస్‌ బ్యాటింగ్‌ నాగరాజు పలు రాష్ట్రాల్లో కీలకమైన ఆర్థిక నేరాల్లో చిక్కుకుని కటకటాల వెనక్కు వెళ్లాడు. అతని కుటుంబ నేపథ్యం.. తదితర వివరాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సాక్షి, పోలాకి(శ్రీకాకుళం) : బుడుమూరు నాగరాజు తండ్రి అప్పలస్వామి స్వగ్రామం కోటబొమ్మాళి మండలంలోని పేటపాడు. అక్కడ నుండి 30 ఏళ్ల కిందట విశాఖపట్నంలోని కూర్మన్నపాలేనికి వలస కూలీగా వెళ్లి అక్కడే సుమారు 25 ఏళ్లపాటు నివాసం వున్నాడు. భార్య అప్పలనర్సమ్మతోపాటు కూతురు శ్యామల, కుమారుడు నాగరాజులను ఉన్నంతలో చక్కగా చదివించాలనే ఆలోచన చేశాడు. అయితే చిన్నప్పటి నుండే క్రికెట్‌ వైపు మోజుగా వున్న నాగరాజుకు ఎక్కడా అడ్డు చెప్పకుండా బాగా ప్రోత్సహించాడు. ఆ తరువాత కాలంలో స్ధానికంగా వున్న జట్లకు సారథ్యం వహిస్తూ.. విశాఖ సిటీ, జిల్లా, రాష్ట్రస్ధాయిలో మంచి క్రీడాకారుడిగా గుర్తింపుపొందాడు.

అందులో పలు రికార్డులు నెలకొల్పాలనే ఆలోచనతో కొత్తకొత్త ప్రయోగాలు సైతం చేసేవాడు. 2009లో అండర్‌ 16 కేటగిరీలో స్టేట్‌ లెవల్‌లో రాణించాడు. 2010లో స్టేట్‌ సౌత్‌జోన్‌ నుంచి ఎంపికై ఆరు రాష్ట్రాల జట్లతో తలపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ కార్పొరేట్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఆడేందుకు ఎయిర్‌ ఇండియా టీంలో స్థానం దక్కించుకున్నాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ సారథ్యంలో 8 మ్యాచ్‌లు ఆడాడు. ఒక మ్యాచ్‌లో 52 బంతుల్లో 108 పరుగులు చేసి 2014లో ఆంధ్రప్రదేశ్‌ తరుపున రంజీ ట్రోఫీకి సైతం ఎంపికయ్యాడు. ఆ తరువాత అతని తండ్రి కూతురికి వివాహం చేసి అనారోగ్యంతో మంచంపట్టి మరణించాడు. దీంతో నాలుగేళ్ల క్రితం యవ్వారపేట గ్రామానికి చెందిన దూరపు బంధువుల ఇంట్లో తన తల్లితో కలసి నివాసం వుంటున్నాడు. 

చేసింది ఆర్థిక నేరాలే.. అయినా పేదరికమే
హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు తదితర చోట్ల పలు ఆర్థిక నేరాల్లో ప్రథమ ముద్దాయిగా వున్న నాగరాజు ఇంట్లో మాత్రం కడు పేదరికం కన్పిస్తుంది. సొంత ఇల్లు లేదు. తల్లికి గానీ తనకు గానీ ఇప్పటికీ రేషన్‌ కార్డు సైతం లేదంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. భర్త చనిపోయి నాలుగేళ్లయినా పింఛన్‌ రాక, స్ధానికంగా ఎవరో బయటి వ్యక్తుల పేరు మీద ఉపాధి పనులకు వెళ్లి, కుదిరితే వ్యవసాయ పనులకు వెళ్తూ  నాగరాజు తల్లి అప్పలనర్సమ్మ కడు పేదరికాన్ని అనుభవిస్తోంది. పట్టుమని పది ఇళ్లు లేని యవ్వారపేట గ్రామంలో బతకడం కూడా కష్టమే అవుతుందని.. కొడుకు చేసిన పనులకు తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినా.. ఎప్పటికైనా మారతాడని, తనకు పెళ్లి చేసి కళ్లారా చూడాలన్న ఆశతో బతుకుతున్నానని ఆమె కన్నీళ్లతో ‘సాక్షి’కి చెప్పింది. 

ప్రముఖ కేసుల్లో మార్మోగుతున్న నాగరాజు పేరు
ఇంతగా క్రీడాకారుడిగా గుర్తింపు లభించినా ఆర్థికంగా మాత్రం నాగరాజు ఇబ్బంది పడేవాడు. దీంతోపాటు విలాసాలకు సైతం అలవాటు పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. సులభంగా సంపాదించాలనే ఆలోచనతో చేసిన పొరపాట్లతో నేడు అడ్డంగా దొరికిపోయాడు.

తాజాగా నెల్లూరులో అరెస్ట్‌ చేసిన పోలీసులు
నాగరాజును నెల్లూరు సింహపురి ఆసుపత్రి కూడలి వద్ద తాజాగా 29వ తేదీ సోమవారం అరెస్ట్‌ చేసి మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఎంబీఏ వరకు చదువుకున్న నాగరాజు పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్ధలు, బడాబాబులను టార్గెట్‌ చేసి వారి ఫోన్లు ట్యాప్‌ చేసి వారు మాట్లాడినట్లు మాట్లాడి తన బ్యాంక్‌ ఖాతాలో లక్షల రూపాయలు జమ చేయించుకుని బ్యాంకాక్‌ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే నెల్లూరు నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి ఫోన్‌ చేసి.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కేఎన్‌ఆర్‌ను మాట్లాడుతున్నానని, రంజీ ఆటగాడు నాగరాజుకు ఆర్థికంగా సహాయం చేయమని తద్వారా ఏడాదిపాటు తన బ్యాట్‌పై తమ ఆసుపత్రి లోగో వేస్తాడంటూ నమ్మబలికి సదరు ఆసుపత్రి నుంచి డబ్బులు తీసుకునేందుకు వెళ్లే క్రమంలో పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. గతంలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరాం తన నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడని చెప్పి నాగరాజు వార్తల్లోకి ఎక్కాడు. దీంతోపాటు అనేకసార్లు రిమాండ్‌కు వెళ్లి బెయిల్‌పై వచ్చి మళ్లీ అదే పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు