పక్కా పథకం ప్రకారమే ఆమె హత్య!

11 Dec, 2019 11:41 IST|Sakshi

తలపై తీవ్రంగా మోది అత్యాచారానికి పాల్పడిన నిందితుడు

చేతులకు సైతం తీవ్ర గాయాలు..

తల నరాలు చిట్లి గడ్డకట్టిన రక్తం

ఆ గాయాలతోనే మానస మృతి?

సాక్షి, వరంగల్‌ : పుట్టిన రోజు నాడే పరిచయం ఉన్న వ్యక్తి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన గాదం మానస కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె మరణంపై తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా కొత్త విషయాలకు బయటకు వస్తున్నాయి. గత నెల 27న తన పుట్టిన రోజున బయటకు వెళ్లిన మానస అత్యాచారం, హత్యకు గురి కావడం... ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే ఘటనకు బాధ్యుడైన పులి సాయిగౌడ్‌ అలియాస్‌ సాయికుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. పోలీసులు ఈ కేసును హత్యగా పేర్కొన్నప్పటికీ.. రక్తస్రావం వల్ల మానస చనిపోవచ్చన్న ప్రచారం సాగింది. అయితే ముమ్మాటికీ గాదం మానసది అత్యాచారం, హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్లాన్‌ ప్రకారమే...
అత్యాచారానికి ముందు మానసను నిందితుడు సాయికుమార్‌ తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తొంది. నిందితుడు పక్కా ప్రణాళికతోనే బలవంతంగా మానసపై అత్యాచారానికి పాల్పడిన క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించిందని సమాచారం. ఈ మేరకు చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. నిందితుడిపై మానస తిరుగుబాటు చేసే క్రమంలో ఆమె రెండు చేతులకు తీవ్ర గాయాలయయ్యాయని సమాచారం. అలాగే, తలపై సైతం తీవ్రంగా దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పాటు తలలో రక్తం సైతం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారని తెలిసింది.

నివేదిక కోసం ఎదురుచూపులు
మానస అత్యాచారం ఘటనలో వెంటనే స్పందించిన పోలీసులు పులి సాయికుమార్‌ను అరెస్టు చేయగా.. ఈ ఘటనపై మానస ఆమె తల్లిదండ్రులు గాదం స్వరూప, మల్లయ్యలు మాత్రం సాయికుమార్‌తో పాటు ఇంకెవరైనా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మానసపై అత్యాచారం అత్యంత అమానవీయంగా జరిగిందని గుర్తించిన వైద్యులు.. ఈక్రమంలో మానసకు తీవ్ర రక్తస్రావం జరిగిందని తేల్చారని తెలిసింది. అలాగే, పూర్తిగా నిర్ధారించుకునేందుకు సెమెన్‌ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి అందే నివేదిక ఆధారంగా అత్యాచారం ఘటనలో ఒకరు లేదా అంతకు మించి ఉన్నారా అని నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది.

తద్వారా కేసులో స్పష్టత వస్తుందని అపోహలు తొలగిపోతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, ఈ కేసులో పులి సాయికుమార్‌ అరెస్టుకు ముందు మానస ‘కాల్‌ డేటా’ ఆధారంగా ముగ్గురు ఉన్నతాధికారుల డ్రైవర్లు, అటెండర్లను కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. అయితే, ఫోన్‌ చేస్తే ఆ ఆ అధికారుల ఇళ్లకు కూరగాయలు పంపే క్రమంలో... మానస ఫోన్‌లో కాల్స్‌ ఉండడంతో అనుమానించిన పోలీసులు ఈ కోణంలోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలకాంశాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చదవండి: పరిచయం.. ప్రేమ.. అత్యాచారం.. హత్య 

మరిన్ని వార్తలు