చైన్‌ స్నాచింగ్‌ ఇరానీ గ్యాంగ్‌ పనే..

13 Aug, 2019 12:07 IST|Sakshi

సాక్షి, జోగిపేట : జోగిపేట పట్టణంలో వరుస చైన్‌ స్నాచింగ్‌లతో బెంబేలెత్తించిన బీదర్‌ దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుసగా మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న సంఘటనలు జరుగుతుండడంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. అనుమానంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోని తీసుకొని విచారించగా పట్టణంలో జరిగిన దొంగతనాలను తామే చేశామని, తమతో పాటు మహేష్, మమ్ములు ఉన్నారని ఒప్పుకున్నారు. బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారణకు వచ్చారు.

పట్టణంలో ఇప్పటి వరకు జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో సుమారుగా 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దొంగతనాన్ని అంగీకరించిన ఇద్దరు దొంగలు బంగారం తమ వద్ద లేదని, అమ్ముకొని ఖర్చు చేశామని చెప్పినట్లు సమాచారం. నిందితుల వద్ద ఉన్న బైకు, రూ.3 వేలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దొంగల వద్ద నుంచి రికవరీ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డా లాభం లేకుండా పోయింది. అయితే మరో ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుంచి రికవరీ చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. చైన్‌ స్నాచింగ్‌ దొంగలు దొరకడంతో స్థానికంగా మహిళలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కచ్చితంగా ఇరానీ గ్యాంగ్‌ పనే..
జోగిపేటలో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జోగిపేట సీఐ తిరుపతిరాజు తెలిపారు. సోమవారం సీఐ కార్యాలయంలో ఎస్‌ఐలు వెంకటరాజాగౌడ్, ప్రభాకర్‌లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దొంగతనాలకు పాల్పడింది బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్‌ సభ్యులేనని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ వివరిస్తూ.. జోగిపేటలో ఆదివారం హనుమాన్‌ చౌరస్తాలో ఎస్‌ఐ వాహనాలను తనిఖీ చేస్తుండగా బీదర్‌కు చెందిన జాఫర్‌ అలీ, సత్తాజ్‌ అలీ అనే ఇద్దరు వ్యక్తులు బైకుపై అనుమానస్పదంగా కనిపించారని తెలిపారు.

వారిని అదుపులోకి తీసుకొని విచారించగా జోగిపేట, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, తాండూర్, బాల్కిలలో ఇప్పటి వరకు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. జనవరిలో జోగిపేట క్లాక్‌టవర్‌ వద్ద మూడున్నర తులాలు, వడ్డెర బస్తీ వద్ద మూడు తులాలు, మేలో వాసవీనగర్‌లో తొమ్మిదిన్నర తులాల బంగారు గొలుసులు, అదే నెలలో నారాయణఖేడ్‌లో రెండు తులాల బంగారు గొలుసులు దొంగిలించినట్లుగా ఒప్పుకొని దొంగతనం చేసిన ప్రదేశాలను సైతం చూపించారని సీఐ వివరించారు.

వట్‌పల్లి బ్యాంకు వద్ద గత నెల ప్రస్తుతం దొరికిన జాఫర్‌తో పాటు బీదర్‌కు చెందిన నవాబ్‌లు బ్యాంకు వచ్చిన వ్యక్తికి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించి రూ.15 వేలు ఎత్తుకెళ్లారని తెలిపారు. పరారీలో ఉన్న మమ్ము, మహేష్‌ అలియాస్‌ సోనియాలను కూడా పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో జోగిపేట, వట్‌పల్లి ఎస్‌ఐలు కష్టపడ్డారని, వీరితో పాటు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌లు రశీద్, ఏసయ్యలు కూడా దొంగలను పట్టుకోవడానికి కృషి చేశారని తెలిపారు. వీరికి అవార్డు ఇచ్చేందుకు ఉన్నత అధికారులకు లెటర్‌ రాసినట్లు సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు