అక్రమాలకు బార్లా

10 Sep, 2019 08:23 IST|Sakshi
బెంగళూరు బార్లలో వినోదం మాటున పెరుగుతున్న అక్రమ కార్యక్రమాలు

నగరంలో పోలీసుల దాడులు  

100 మందికిపైగా మహిళా సిబ్బందికి విముక్తి

కర్ణాటక, బనశంకరి: ఉద్యాన నగరిలో నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న మూడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఆదివారం రాత్రి సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు దాడిచేసి 100 మందికిపైగా యువతులను కాపాడి, సిబ్బందిని అరెస్ట్‌ చేశారు. అశోకనగరలోని రెసిడెన్సీరోడ్డులో గల పేజ్‌ త్రీ బార్‌పై దాడిచేసిన సీసీబీ పోలీసులు 17 మంది సిబ్బందిని అరెస్ట్‌ చేసి 67 మంది యువతులను కాపాడారు. యువతులందరూ బార్‌లో డ్యాన్సర్లుగా, సప్లయర్లుగా పనిచేసేవారు. బార్‌లో ఉన్న 27 మంది కస్టమర్లను పంపించేశారు. పరారీలో ఉన్న యజమాని సంతోష్, రాజు కోసం గాలిస్తున్నామని డీసీపీ చేతన్‌సింగ్‌ తెలిపారు. టైమ్స్‌ బార్‌పై దాడిచేసిన పోలీసులు 27 మంది యువతులను కాపాడి  16 మందిని అరెస్ట్‌ చేశారు.

పరారీలో ఉన్న యజమాని మహేశ్, పాయల్‌ కోసం గాలిస్తున్నారు. కబ్బన్‌పార్కు సమీపంలోని డయట్‌ బార్‌పై దాడిచేసిన పోలీసులు ముగ్గురు సిబ్బందిని అరెస్ట్‌ చేసి 15 మంది మహిళా ఉద్యోగుల్ని కాపాడారు. మూడు బార్లలోనూ పెద్ద శబ్ధంతో మ్యూజిక్‌ పెట్టడం, ఎక్సైజ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసిందని డీసీపీ చేతన్‌సింగ్‌ తెలిపారు. అశోక్‌నగర, కబ్బన్‌ పార్కు పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు