సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్‌ చేశాం: ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర

3 Feb, 2018 11:50 IST|Sakshi
నల్లగొండ సీఐ వెంకటేశ్వర్లు, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర (ఫైల్‌ ఫొటోలు)

సాక్షి, నల్లగొండ : రెండు రోజులుగా కనిపించకుండాపోయిన నల్లగొండ టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు జాడను కనిపెట్టామని ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర చెప్పారు. సర్వీస్‌ రివాల్వర్‌, సిమ్‌కార్డులను తిరిగిచ్చేసి అదృశ్యమైన సీఐ.. గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ రిసార్ట్స్‌లో మారుపేరుతో ఉన్నట్లు గుర్తించామని, ఇవాళే నల్లగొండ హెడ్‌ క్వార్టర్స్‌కు తీసుకొస్తామని తెలిపారు. గాలింపు కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఇప్పటికే ఇప్పటికే అతనిని కలుసుకున్నట్లు తెలిసింది. అటు వెంకటేశ్వర్లు కుటుంబం కూడా నల్లగొండకు బయలుదేరినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో సీఐ వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉండటంతో అదృశ్యం ఘటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. మరో కేసు(పాలకూరి రమేశ్‌ హత్య)కు సంబంధించి నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం సీఐ వెంకటేశ్వర్లు కనిపించకుండా పోయారు. సర్వీస్‌ రివాల్వర్‌ను డ్రైవర్‌కు, మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్‌లో సిమ్‌కార్డును అప్పగించి వెళ్లిపోయారు. వ్యక్తిగత ఫోన్‌కూడా స్విచ్చాఫ్‌ చేసుకున్నారు. నల్లగొండ పట్టణంలో వరుస హత్యలపై సీఐని ఉన్నతాధికారులు మందలించినట్టు తెలిసింది. సీఐ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని వెల్లడించి తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శ్రీనివాస్‌ హత్య కేసులో కొందరు నిందితులకు బెయిల్‌ రావడంతో ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి సీఐ ఆచూకీ లభించడంతో కుటుంబీకులు, పోలీసు శాఖ ఊపిరి పీల్చుకున్నట్లైంది.

మరిన్ని వార్తలు