కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య

6 Nov, 2023 07:42 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో గనులు, భూవిజ్ఞాన శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న కేఎస్‌ ప్రతిమ(43) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ  దారుణ హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఇక, రామనగర జిల్లాలో పని చేస్తున్న ఆమె బదిలీపై ఇటీవలే బెంగళూరుకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఆమె హత్య అధికార, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. 

ప్లాట్‌లో ఒంటరిగా..
వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా తుడ్కికి చెందిన ప్రతిమకు 18 ఏళ్ల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లయింది. 2017లో ఆమెకు గనులు భూగర్భ శాఖలో జియాలజిస్టుగా ఉద్యోగం లభించింది. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలలో పనిచేశారు. రామనగర జిల్లాలో విధుల్లో చేరిన ప్రతిమ తరువాత బెంగళూరుకు బదిలీ అయింది. కొంతకాలంగా దొడ్డకల్లసంద్రలోని గోకుల అపార్టుమెంట్‌లో అద్దె ఫ్లాటులో ఒంటరిగా నివాసం ఉంటుంది. భర్త సత్యనారాయణ, ఎస్‌ఎస్‌సీ చదువుతున్న కుమారుడు చిరాత్‌ తీర్థహళ్లిలోనే ఉండేవారు. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు కార్యాలయం నుంచి ఇంటికి ప్రతిమను కారులో డ్రైవరు డ్రాప్‌ చేసి వెళ్లాడు. కాగా, కాసేపటికే ప్రతిమపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. 

అయితే, ప్రతిమకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తన సోదరి స్పందించకపోవడంతో ఆమె సోదరుడు ప్రతీక్‌, అక్కడున్న వారికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి చూసేసరికి ప్రతిమ హత్యకు గురైందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రతిమ సొంతూరు తుడ్కిలో ఇటీవల కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కూడా చేశారు. రెండెకరాలు వక్కతోట ఉండటంతో వక్క పంట కోయడానికి భర్త , కుమారుడు అక్కడే ఉంటున్నారు. ఆమె దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంది. కుటుంబసభ్యులు ఆక్రందనలు మిన్నంటాయి.

దాడులే కారణం..
మరోవైపు.. ప్రతిమ హత్యపై కర్ణాటక పర్యావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. ఆమె చాలా డైనమిక్‌ లేడీ. ఎంతో ధైర్యవంతురాలు. ఎంతో కష్టపడి డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతిమ ఇటీవల కొన్ని ప్రదేశాల్లో దాడులు చేశారు. ఈ దాడుల కారణంగానే ఆమెపై అటాక్‌ జరిగి ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక, ప్రతిమ 2017 నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు రామనగరలో పని చేశారని జిల్లాధికారి కేఏ దయానంద తెలిపారు. అన్ని సమావేశాలకు దస్త్రాలతో హాజరయ్యేవారని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు నుంచి అక్రమంగా కంకర, ఇసుక రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమెకు సూచించానని చెప్పారు. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులు తమకు అందలేదని ఆమె స్పష్టం చేశారని తెలిపారు.

మరిన్ని వార్తలు