పోలీసుల మాక్‌ డ్రిల్‌

29 May, 2018 10:31 IST|Sakshi

కంటోన్మెంట్‌ (బోయిన్‌పల్లి) : ‘నిత్యం వేలాది మంది భక్తులు సం దర్శించే తాడ్‌బంద్‌ దేవాలయంలోకి ఆదివారం రాత్రి ముష్కరులు చొరబడ్డారు!! సమాచారం అందుకున్న వెంటనే ఆక్టోపస్, సిటీ సెక్యూరిటీ గార్డ్స్‌ బృందాలతో పాటు, బోయిన్‌పల్లి పోలీసుల బృందం ఆలయాన్ని చుట్టుముట్టింది. వేర్వేరు బృందాలుగా విడిపోయి మెరుపు వేగంతో సమీపంలోని భవనాల మీదుగా దేవాలయం నలుదిక్కులకు చేరారు.

అప్పటికే ఆలయం లోపు మాటువేసి ఉన్న ముష్కరుల కదలికలను కనిపెడుతూ ఒక్కొక్కరుగా దేవాలయంలోకి చేరిపోయారు. పోలీసులను ప్రతిఘటిస్తూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న ముష్కరులను చాకచక్యంగా లొంగదీసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు’

ఇదంతా నిజమనుకుంటున్నారు కదూ. అదేం కాదు. అసలేమైందంటే.. సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ వీరాంజనేయ స్వామి ఆలయంలో బోయిన్‌పల్లి పోలీసులు, ఆక్టోపస్, సిటీ సెక్యూరిగార్డ్స్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ ఇది. ఆక్టోపస్‌ డీఎస్‌పీ వీరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌ మొత్తం 100 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు.

ప్రజలు ఎక్కువ సంఖ్యలో సందర్శించే షాపింగ్‌ మాల్స్, ప్రార్థనాలయాలు, ఇతరత్రా రద్దీ ప్రదేశాల వద్ద నిర్వహిస్తున్న మాక్‌డ్రిల్స్‌లో భాగంగానే తాడ్‌బంద్‌ దేవాలయంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించామని బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. మాక్‌ డ్రిల్‌లో బోయిన్‌పల్లి ఎస్‌ఐలు రఘువీర్‌రెడ్డి, సాయికిరణ్‌ సహా 20 మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు