ప్రణయ్‌ హత్యకేసు దర్యాప్తు కొలిక్కి!

18 Sep, 2018 05:21 IST|Sakshi
ప్రణయ్‌ (ఫైల్‌ ఫొటో)

ప్రణయ్‌ కుటుంబంతో సుదీర్ఘంగా మాట్లాడిన పోలీసులు

వారు అనుమానించిన ప్రతి వ్యక్తి గురించి వివరాల సేకరణ

హత్యకు పాల్పడింది బిహారీ వ్యక్తిగా పోలీసుల అనుమానం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.  తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్‌ తిరునగరు మారుతీరావు ఈ హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుతో సబంధం ఉన్న దాదాపు అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ప్రధాన నింది తుడిగా భావిస్తున్న మారుతీరావు పోలీసులకు చిక్కడంతో ఈ కేసులో చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోయాయని చెబుతున్నారు. 

పోలీస్‌ ఉన్నతాధికారులు మృతుడి కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా మాట్లాడారని సమాచారం. ప్రణయ్‌ భార్య అమృత, కుటుంబ సభ్యులు పలువురిపై ఆరోపణలు చేశారు. దీంతో అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఆదివారం రాత్రి పొద్దుపోయే దాకా పోలీస్‌ అధికారులు ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారని తెలిసింది. మారుతీరావుకు సన్నిహితుడిగా భావిస్తున్న సూర్యాపేటకు చెందిన ఓ న్యాయవాది, తాజా మాజీ ఎమ్మెల్యే పేర్లను అమృత పదేపదే ప్రస్తావించిన అంశాన్ని పోలీసులు సీరియస్‌గానే తీసుకున్నారు. మరోవైపు ఆమె తన తండ్రికి నయీం ముఠాతోనూ సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం సంచలనం రేపింది. వీటన్నిటికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

హత్యకు పాల్పడింది బిహారీ!
ప్రణయ్‌ను అంతమొందించేందుకు మారుతీరావు, మాజీ ఉగ్రవాది మహ్మద్‌ అబ్దుల్‌ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బారీ తన సహచరులను కాకుండా హైదరాబాద్‌లో ఉంటున్న ఒక బిహారీ వ్యక్తిని ఈ ఆపరేషన్‌కు వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.  

నేడు మీడియా ముందుకు నిందితులు  
ప్రణయ్‌ హత్య కేసు వివరాలతో మంగళవారం మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎస్పీ రంగనాథ్‌ మీడియా సమావేశం నిర్వహించ నున్నారు. 

మరిన్ని వార్తలు