చిత్తూరులో హైటెక్‌ వ్యభిచారం బట్టబయలు

16 Dec, 2019 11:05 IST|Sakshi
తాలూకా స్టేషన్‌లో యువతులు

సాక్షి, చిత్తూరు అర్బన్‌: చిత్తూరులో హైటెక్‌ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో పోలీసులు పక్కాప్లాన్‌ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఆదివారం నగరంలోని మురకంబట్టులో నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను వ్యభిచారంలోకి దింపిన ఓ మహిళ వీళ్లను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

అందమైన యువతుల ఫొటోలను వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేసి, వీళ్ల రేట్లను సైతం అందులో ఉంచుతూ వచ్చింది. ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు నిర్ణయించేది. యువతుల వ్యవహారం చూసే స్థానికులకు వీళ్లు కళాశాల విద్యార్థులుగా భావించేవారు. ఇక్కడున్న ఓ వ్యక్తి అసలు విషయాన్ని గుర్తించి నేరుగా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విటులుగా మగ పోలీసులను పంపించి, మఫ్టీలో ఆడ పోలీసులతో నిఘా ఉంచి చాకచక్యంగా వ్యభిచార వ్యవహారాన్ని పట్టుకున్నారు. ఈ మొత్తం ఘటనలో మురకంబట్టుకు చెందిన ఓ మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఎంతటి వాళ్లున్నా వదిలే ప్రసక్తేలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకురాలిని సైతం అదుపులోకి తీసుకున్నారు. యువతులను మాత్రం వారి సొంత ఊర్లకు పంపడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు