హత్యా..ప్రమాదమా?

26 Sep, 2018 12:37 IST|Sakshi
రమ్య (ఫైల్‌), మినీ లారీ డ్రైవర్‌ పళని

మినీలారీ ఢీకొని యువతి దుర్మరణం

అనుమానాలు వ్యక్తం చేసిన తండ్రి

సాక్షి, చెన్నై: వాల్టాక్స్‌ రోడ్డులో మినీలారీ స్కూటర్‌ను ఢీకొనడంతో ఓ యువతి దుర్మరణం చెందింది. అయితే, ఇది ప్రమాదమా.. లేదా పథకం ప్రకారం ఆ యువతిని హతమార్చారా అన్న అనుమానాలు బయలుదేరాయి. ఇది ముమ్మాటికి హత్యే అని, తన మామ, ఆయన కుమారుడు పన్నిన కుట్రగా మృతురాలి తండ్రి, ఎస్‌ఐ తుల సింగం ఆరోపిస్తున్నారు. ఉత్తర చెన్నై పరిధిలోని షావుకారు పేటకు చెందిన తుల సింగం సముద్ర తీర భద్రతా విభాగంలో ఎస్‌ఐ. ఆయన కుమార్తె రమ్య నుంగంబాక్కంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుంది. సోమవారం రాత్రి విధుల్ని ముగించుకుని షావుకారు పేటలోని ఇంటికి రమ్య తన స్కూటర్‌పై బయలుదేరింది. మార్గమధ్యంలోని వాల్టాక్స్‌ రోడ్డు ఎలిపెంట్‌ గేట్‌ వద్ద ఓ మినీ లారీ స్కూటర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో రమ్య అక్కడికక్కడే మృతిచెందింది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన కుమార్తె ఇంటికి రాకపోవడంతో తులసింగం కుటుంబం ఆందోళనలో పడింది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఓ ఫోన్‌ కాల్‌ ఆకుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. రమ్య ప్రమాదంలో మరణించినట్టుగా పోలీసులు నుంచి అందిన సమాచారంతో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. అప్పటికే ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అక్కడికి చేరుకున్న కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. ఉదయాన్నే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీలకు పోలీసులు అప్పగించారు.

అనుమానాలు: తొలుత ప్రమాదం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, ప్రమాదానికి కారకుడైన ఆవడి పట్టాభిరాంకు చెందిన డ్రైవర్‌ పళనిని అరెస్టు చేశారు. అయితే, తన కుమార్తెది ప్రమాదం కాదని, హత్య అని మృతురాలి తండ్రి, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తుల సింగం ఆరోపించడంతో కేసు అనుమానాస్పదంగా మార్చక తప్పలేదు. తన కుమార్తెను పథకం ప్రకారం హత్య చేయించి ఉన్నారని తులసింగం ఆరోపించడంతో పోలీసులు ఆ దిశగా దృష్టి పెట్టారు. తన మామ, సినీ స్టంట్‌ మాస్టర్‌ రత్నం, ఆయన కుమారుడు ఎతిరాజులు పథకం ప్రకారం తన కుమార్తెను మట్టు బెట్టారని ఎలిఫెంట్‌ గేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాల మధ్య ఆస్తుల గొడవ సాగుతోందని, తన తరఫున రమ్య వారిని నిలదీస్తూ, పోరాడుతూ వస్తున్నందున, అందుకే తన కుమార్తె అడ్డు తొలగించినట్టున్నారని తుల సింగం అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు