బంధువులే ముఠాగా ఏర్పడి..

27 Apr, 2019 13:27 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న బాజీజాన్‌ సైదా

మహిళల మెడల్లోని బంగారు గొలుసులు తెంపుకెళుతున్న వైనం

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రూ.4 లక్షల విలువచేసే సొత్తు స్వాధీనం  

నెల్లూరు(క్రైమ్‌): వారు ముగ్గురూ బంధువులు. ముఠాగా ఏర్పడ్డారు. బైక్‌లను దొంగలించి వాటిపై సంచరిస్తూ మహిళ మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. నెల్లూరు సీసీఎస్, పొదలకూరు పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్‌ చేశారు. శుక్రవారం నగరంలోని సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాజీజాన్‌ సైదా వివరాలను వెల్లడించారు. దగదర్తి మండలం చాముదల గ్రామానికి చెందిన కె.తిరుపతి, ఆత్మకూరుకు చెందిన డి.తిరుపతి అలియాస్‌ పులి, ఎన్‌.కిరణ్‌లు బంధువులు. వారు చెడు వ్యవసనాలకు బానిసలై దొంగలుగా మారారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు పాలై బెయిల్‌పై బయటకు వచ్చారు. తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించారు.

పలు ప్రాంతాల్లో..
నిందితులు కొంతకాలం క్రితం బుచ్చిరెడ్డిపాళెంలో ఓ మోటార్‌బైక్‌ను దొంగలించారు. దానిపై పొదలకూరు, రాపూరు, కండలేరు, కలువాయి ప్రాంతాల్లో తిరుగుతూ మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. వీరి కదలికలపై సీసీఎస్, పొదలకూరు పోలీసులు నిఘా ఉంచారు. శుక్రవారం ఉదయం నిందితులు పొదలకూరు సంగం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాజీజాన్‌ సైదా, పొదలకూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై రవినాయక్‌లు తమ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా నేరాలు చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి రూ.3.25 లక్షలు విలువచేసే ఒక మోటార్‌బైక్, 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు.

సిబ్బందికి అభినందన
నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌ సైదా, పొదలకూరు సీఐ ఫిరోజ్, ఎస్సై రవినాయక్, సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్స్‌ ఆర్‌.సురేష్‌కుమార్, కె.వెంకటేశ్వర్లు, పి.సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్స్‌ జి.రాజేష్, జి.ప్రభాకర్, యు.సురేష్, సీహెచ్‌ శ్రీనివాసులను సీసీఎస్‌ డీఎస్పీ బి.నరసప్ప అభినందించి రివార్డులు ప్రకటించారు.   

నిందితులపై పలు కేసులు
♦ కె.తిరుపతిపై జలదంకి పోలీసు స్టేషన్‌లో బంగారు దొంగతనం కేసు ఉంది.
♦ డి.తిరుపతి అలియాస్‌ పులిపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో మర్డర్‌ ఫర్‌ గెయిన్‌ కేసు ఉంది.
♦ ఎన్‌.కిరణ్‌పై ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో రేప్, మర్డర్‌ కేసు ఉంది.

మరో నిందితుడు  
పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి బంధువైన దగదర్తి మండలం చవటపుత్తేడు గ్రామానికి చెందిన కె.వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.75 వేలు విలువచేసే రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు